Home  »  News  »  చిక్కుల్లో విజయ్ దేవరకొండ, వెంకటేష్.. లీగ్ అగ్రిమెంట్లు రద్దు చేసుకోవాలంటూ నోటీసులు!

Updated : Jun 17, 2026

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా లీగల్ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘టీజీ20 లీగ్’ ఇప్పుడు పెద్ద దుమారానికి కేంద్రబిందువుగా మారింది. ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) షాకిస్తూ లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు క్రీడా వర్గాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.

అసలు విషయానికి వస్తే, జూన్ 21 నుంచి జూలై 12 వరకు జరగాల్సిన ఈ టీజీ20 లీగ్‌ నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేస్తోంది. నిబంధనల ప్రకారం లీగ్ ప్రారంభానికి 45 రోజుల ముందే బీసీసీఐ నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని, కానీ హెచ్‌సీఏ ఎలాంటి రూల్స్ పాటించకుండా అక్రమంగా నిధులు వసూలు చేస్తోందని టీసీఏ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఈ లీగ్‌ను ప్రమోట్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ విజయ్ దేవరకొండతో పాటు సీనియర్ హీరో వెంకటేష్, క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది.

వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రచారాల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వెంటనే తమ అగ్రిమెంట్లను పునఃసమీక్షించుకోవాలని నోటీసుల్లో హెచ్చరించారు. ఈ వ్యవహారంపై టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి స్పందిస్తూ.. ఇదొక మోసపూరిత లీగ్ అని, అనుమతి పత్రాలు ఉంటే హెచ్‌సీఏ మీడియా ముందు ప్రదర్శించాలని సవాల్ విసిరారు. అయితే దీనికి భిన్నంగా, తమకు బీసీసీఐ అనుమతులు ఉన్నాయని, భారత ఆటగాళ్లు కూడా ఇందులో పాల్గొంటున్నారని హెచ్‌సీఏ గతంలోనే ప్రకటించడం విశేషం.

సాధారణంగానే విజయ్ దేవరకొండ ఏం చేసినా సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ లీగల్ నోటీసుల వార్త బయటకు రావడంతో రౌడీ హీరో అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక ఈవెంట్‌ను ప్రమోట్ చేసినందుకు హీరోలకు నోటీసులు ఇవ్వడం ఏంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తుంటే, అసలు లీగ్ భవితవ్యం ఏంటనే చర్చ నెట్టింట జోరందుకుంది.

ఈ వివాదం మరింత ముదరక ముందే హెచ్‌సీఏ యాజమాన్యం గానీ, లేదా విజయ్ దేవరకొండ టీమ్ గానీ దీనిపై అధికారికంగా స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఏదేమైనా మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కావాల్సిన టీజీ20 లీగ్ చుట్టూ ఇలాంటి వివాదాలు ముసురుకోవడం టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్మేలా చేస్తోంది. మరి ఈ లీగల్ నోటీసుల పర్వానికి ఎక్కడ బ్రేక్ పడుతుందో వేచి చూడాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.