Home  »  News  »  'సింగ్ గీతం'లో విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ రోల్.. థియేటర్లలో రౌడీ బాయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Updated : Jun 12, 2026

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakond) ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమైనా అక్కడ క్రేజ్ మామూలుగా ఉండదు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డ్రీమ్ ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' (Sing Geetham) సినిమాలో విజయ్ దేవరకొండ అస్సలు ఊహించని విధంగా ఒక అతిథి పాత్రలో మెరిశారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌లో రౌడీ హీరో ఎంట్రీ ఇవ్వడంతో థియేటర్లన్నీ ఒక్కసారిగా విజిల్స్, కేకలతో దద్దరిల్లిపోయాయి. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ కనిపించేది కేవలం 2 నుండి 3 నిమిషాల స్క్రీన్ టైమ్ మాత్రమే అయినప్పటికీ, ఆ కొద్ది నిమిషాల్లోనే ఆయన తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో థియేటర్లలో పూనకాలు తెప్పించారు.

సినిమా చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విజయ్ దేవరకొండ లక్కీ ఛార్మ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ట్రాక్ రికార్డ్ గమనిస్తే విజయ్ దేవరకొండకు ఆయనకు ఉన్న సెంటిమెంట్ మరోసారి నిజమైందని స్పష్టమవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకుడిగా పరిచయమైన నాని 'ఎవడే సుబ్రమణ్యం' సినిమాలో విజయ్ కీలక పాత్రలో నటించారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్‌కు దర్శకుడిగా ఇండస్ట్రీలో తిరుగులేని పేరు తెచ్చిన సావిత్రి బయోపిక్ 'మహానటి'లోనూ విజయ్ దేవరకొండ ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'లో అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్ ఇచ్చారు. కేవలం డైరెక్షన్ మాత్రమే కాదు, నాగ్ అశ్విన్ గతంలో నిర్మించిన బ్లాక్‌బస్టర్ 'జాతి రత్నాలు' సినిమాలోనూ విజయ్ దేవరకొండ ఒక చిన్న క్యామియో రోల్‌లో తళుక్కున మెరిశారు. ఇప్పుడు ఆయన తాజాగా ప్రొడ్యూస్ చేసిన 'సింగ్ గీతం'లోనూ విజయ్ దేవరకొండ 2 నుండి 3 నిమిషాల పాటు అలరించడంతో నాగ్ అశ్విన్ తన ప్రతి సినిమాలోనూ విజయ్‌ను వదలడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ చిన్న పాత్రకు ఆడియన్స్ నుండి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విజయ్ దేవరకొండ మాస్ ఇమేజ్ ఏంటో మరోసారి అర్ధమవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 'రణబాలి' అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్, అలాగే రవి కిరణ్ కోలా దర్శకత్వంలో 'రౌడీ జనార్థన' అనే మరో క్రేజీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరోవైపు నాగ్ అశ్విన్ కూడా ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో 'కల్కి 2' సీక్వెల్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. కల్కి పార్ట్ 1 లో అర్జునుడిగా అదరగొట్టిన విజయ్ దేవరకొండ రోల్ పార్ట్ 2 లో కూడా ఉంటుందా లేదా అనే సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో, 'సింగ్ గీతం' మూవీలో ఆయన చేసిన క్యామియో సినిమాకు ఒక బిగ్గెస్ట్ హైలైట్‌గా మారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.