Home  »  News  »  Sing Geetham X Review: 'సింగ్ గీతం' ట్విట్టర్ రివ్యూ.. కమల్ హాసన్ వదులుకున్న 40 ఏళ్ళ నాటి కథ.. ఇప్పుడెలా ఉందంటే?

Updated : Jun 12, 2026

టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) 94 ఏళ్ళ వయసులో చేసిన ఒక అద్భుతమైన దృశ్య కావ్య ప్రయోగం 'సింగ్ గీతం' (Sing Geetham). మాటల బదులు సినిమాలో ప్రతి పాత్ర కేవలం పాటలతోనే మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఒక వినూత్నమైన మ్యూజికల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 40 ఏళ్ళ క్రితమే కమల్ హాసన్ హీరోగా ఈ కథను వెండితెరపై ఆవిష్కరించాలని సింగీతం శ్రీనివాసరావు కలలు కన్నారు. దశాబ్దాల నాటి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు వైవైజంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, సంకల్ప్ గోరా నిర్మించి థియేటర్లలోకి తీసుకువచ్చారు. అమెరికాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడటంతో, సినిమా చూసిన ప్రేక్షకులు ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా తమ రివ్యూలను పంచుకుంటున్నారు. నెటిజన్ల ట్వీట్స్ ప్రకారం ఈ సినిమా మనసును హత్తుకునే ఒక అరుదైన చిత్రంగా నిలిచింది. (Sing Geetham Twitter Review)

సినిమా చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్న మొదటి అంశం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఒక వెన్నుముకలా నిలిచిందని ప్రేక్షకులు కొనియాడుతున్నారు. సినిమాలో సంభాషణలు పాటల రూపంలోనే సాగుతుండటంతో దేవిశ్రీ కంపోజ్ చేసిన ట్యూన్స్ ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, అందులోని ఒక ఎమోషనల్ సోల్ సాంగ్ థియేటర్ల నుండి బయటకు వచ్చినా ప్రేక్షకుడి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఈ చిత్రంలో క్లైమాక్స్ భాగంలో వచ్చే "వినరా వినరా" అనే పాట నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డులన్నీ దేవిశ్రీ ప్రసాద్ కే ఇచ్చేయాలని కొందరు ట్వీట్ చేయడం విశేషం.

నటీనటుల విషయానికి వస్తే ఆయాన్, శాలిని కొండెపుడిలతో పాటు హీరోయిన్ అహల్యా బమ్రూ నటనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అహల్యా బమ్రూ తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ చూపించిన యాక్టింగ్ వేరియేషన్స్ అద్భుతంగా ఉన్నాయని, ఆమె పాత్రతో ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అవుతారని ట్విట్టర్ టాక్ చెప్తోంది. 

కథనంలో ఫస్టాఫ్‌లో అక్కడక్కడా కామెడీ సరిగ్గా పండలేదని, కొన్ని మ్యూజికల్ బిట్స్ సాగదీసినట్లు అనిపించినా, సెకండాఫ్ మాత్రం అద్భుతమైన ఎమోషన్స్‌తో సర్ప్రైజ్ చేస్తుందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సీక్వెన్స్ మరియు గుండెల్ని పిండేసే క్లైమాక్స్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. 94 ఏళ్ళ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ స్కిల్స్ చూసి ప్రేక్షకులు జోహార్లు చెప్తున్నారు. థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడటం మానేసి అందరూ పాటలు పాడాలనిపించేంతలా ఈ సినిమా ప్రభావితం చేస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.