Home  »  News  »  ఇక టికెట్ రేట్ల పెంపుకి చెక్.. ఆ మూడు సినిమాలతో గుట్టు రట్టు! 

Updated : Jul 28, 2026

 


తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నేళ్లుగా సాగుతున్న సినిమా టికెట్ రేట్ల పెంపు కల్చర్‌కు దాదాపు తెరపడినట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు పెద్ద సినిమా వస్తోందంటే చాలు, వందల రూపాయల పెంపులు, హడావుడి జీవోలు, ప్రీమియర్ షోల పేరిట భారీ వసూళ్లు చేయడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. పుష్ప-2 సినిమా విడుదల సమయంలో ఏకంగా 1000 రేటుతో ప్రీమియర్ షోలు వేసిన దాఖలాలు ఉన్నాయి. సంక్రాంతి సీజన్‌లో వచ్చే భారీ చిత్రాలకి  కూడా విపరీతంగా రేట్లు పెంచేసేవారు. చివరకు నాగవంశీ వంటి కొందరు నిర్మాతలు తమ పలుకుబడిని ఉపయోగించి చిన్న సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేలా చేసుకున్న   సందర్భాలు చూశాం. 

ఈ విపరీతమైన రేట్ల పెంపు వల్ల సామాన్య ప్రేక్షకుడు సినిమా హాల్ మొహం చూడటమే మానేశాడు. ఇటీవల 'పెద్ది' వంటి భారీ సినిమా వచ్చినప్పుడు టికెట్ రేట్లు పెంచడం వల్ల ఎంతటి తీవ్ర వ్యతిరేకత వచ్చిందో టాలీవుడ్ వర్గాలు స్వయంగా చూశాయి. ఈ రేట్ల సెగ చివరికి ఓవర్సీస్ మార్కెట్‌కి కూడా తగిలింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, టాక్  యావరేజ్‌అని వచ్చినా చాలు  ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తున్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల సినిమాలు కూడా టికెట్ రేట్ల భారం వల్లే ఆశించిన రీతిలో వసూళ్లు సాధించలేకపోయాయని పరిశ్రమ భావిస్తోంది. టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం వల్లే యావరేజ్ టాక్ ఉన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా మారుతున్నాయని ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వయంగా అంగీకరించడం గమనార్హం.

మరోవైపు అదే సమయంలో సాధారణ టికెట్ రేట్లతో వచ్చిన 'మా ఇంటి బంగారం', 'లెనిన్', 'చెన్నై లవ్ స్టోరీ' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టాయి. సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉండే టికెట్ ధరలే థియేటర్లకు జనాన్ని రప్పిస్తాయని ఈ సినిమాలు స్పష్టంగా నిరూపించాయి. ఇక ప్రభుత్వాలు, న్యాయస్థానాల వైఖరి కూడా ఈ విషయంలో పూర్తిగా మారింది. తెలంగాణ హైకోర్టు టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై తీవ్రంగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తోంది. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపు ప్రతిపాదనలకు దాదాపు నో చెప్పేసింది.


Also read: christopher Nolan: ఆ భారతీయ దర్శకుడి నుంచి ఎంతో నేర్చుకున్నా.. క్రిస్టోఫర్ నోలన్ మాటలు వైరల్ 

ప్రస్తుతం తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సంప్రదించడానికి దాదాపు 99 శాతం మంది నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత, కోర్టుల సీరియస్‌నెస్, సగటు ప్రేక్షకుల నిరసనని  గమనించిన మేకర్స్ ఇకపై టికెట్ ధరల పెంపు జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు. చివరికి పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర నటుడి సినిమాలను కూడా నైజాం ప్రాంతంలో సాధారణ టికెట్ రేట్లకే ప్రదర్శించడం దీనికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలోనే ఇటువంటి మార్పు వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. సినిమా ఎంత పెద్దదైనా, హీరో ఎంత పెద్ద స్టార్ అయినా సామాన్యుడికి అందుబాటు ధరల్లోనే టికెట్లు అమ్మాలనే మైండ్‌సెట్‌కు నిర్మాతలు వచ్చేశారు. ఇకపై టాలీవుడ్‌లో పెద్ద సినిమాలను కూడా సాధారణ టికెట్ రేట్లకే థియేటర్లలో హ్యాపీగా చూసే మంచి రోజులు వచ్చేశాయని చెప్పవచ్చు. 

Cinema, Chennai Love Story, Lenin, Maa Inti Bangaram






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.