![]() |
![]() |

'వారణాసి' గ్లోబల్ డెబ్యూ:
మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ ఎపిక్ 'వారణాసి' ఏప్రిల్ 24న మెక్సికోలో జరగనున్న 'CCXP México 2026' ఈవెంట్‌లో గ్లోబల్ డెబ్యూ చేయనుంది. ఈ వేడుకలో సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ బీహైండ్-ది-సీన్స్ దృశ్యాలను ప్రదర్శించనున్నారు.
నైబర్స్ గా చిరు, బాలయ్య:
టాలీవుడ్ దిగ్గజాలు చిరంజీవి, బాలకృష్ణ త్వరలో ఇరుగుపొరుగున నివసించబోతున్నారు. జూబ్లీహిల్స్‌లో మెగాస్టార్ ఇంటి వెనుకనే బాలయ్య తన కొత్త లగ్జరీ విల్లాను నిర్మిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా రోడ్ నంబర్ 45 నుండి ప్రశాంతమైన ఈ కొత్త ప్రాంతానికి బాలయ్య షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ వార్తతో మెగా, నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పండుగ చేసుకుంటున్నారు.
‘ఆదర్శ కుటుంబం’లోకి తమన్ ఎంట్రీ:
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంపిక చేశారు. తాజాగా ఆయన ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో తమన్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రభాస్ అభిమానిపై దాడి!
హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రభాస్ అభిమానిపై మేనేజ్‌మెంట్ దాడికి పాల్పడటం తీవ్ర దుమారం రేపుతోంది. 'డార్లింగ్' రీ-రిలీజ్ సందర్భంగా.. సినిమాలో పాటలు వేయలేదని ప్రశ్నించినందుకు ఈ దాడి జరిగినట్లు న్యూస్ వినిపిస్తోంది. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో, ఒక మహిళపై కామెంట్స్ చేసినందుకే.. ఈ దాడి జరిగిందని కూడా ప్రచారం జరుగుతోంది. నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అల్లు కాంపౌండ్ లో మూడో బ్యానర్
అల్లు కాంపౌండ్ లో ఇప్పటికే గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో అల్లు శిరీష్ మూడో నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. హీరోగా ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడంతో.. శిరీష్ నిర్మాణ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అల్లు కుటుంబం నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, గీతా ఆర్ట్స్ సామ్రాజ్యంలో శిరీష్ కొత్త బ్యానర్ ఏ తరహా చిత్రాలను నిర్మిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సిద్ధార్థ్ - త్రిష 'క్లాసిక్' రీ-యూనియన్
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సిద్ధార్థ్, త్రిష మళ్లీ జతకట్టబోతున్నారు. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో దిల్ రాజు ఒక ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'భర్తగా మారకు బ్యాచిలరూ' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదొక రిలేషన్ షిప్ బేస్డ్ రొమాంటిక్ కామెడీగా ఉండబోతోంది.
‘నెపోటిజం’పై శివాత్మిక కామెంట్స్!
సినీ పరిశ్రమలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే ‘నెపోటిజం’పై సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ కిడ్ అవ్వడం వల్ల కేవలం దర్శకులను కలిసే అవకాశం మాత్రమే సులభంగా దొరుకుతుందని, అంతకు మించి మరేమీ ఉండదని ఆమె కుండబద్దలు కొట్టారు. కేవలం బ్యాక్‌గ్రౌండ్ చూసి ఎవరూ అవకాశాలు ఇవ్వరని, కెమెరా ముందు నిలబడినప్పుడు మన టాలెంట్ మాత్రమే మనల్ని కాపాడుతుందని శివాత్మిక అభిప్రాయపడ్డారు.
గుండెపోటుతో ప్రముఖ నటి మృతి
హర్యానాకు చెందిన ప్రముఖ నటి దివ్యాంక సిరోహి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 29 సంవత్సరాలు. బుధవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు చెప్పారు. అతి చిన్న వయసులోనే దివ్యాంక మరణించడం హర్యానా చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తల్లి కాబోతున్న మోనాలిసా..!
కుంభమేళాలో వైరల్ అయి హీరోయిన్‌గా మారిన మోనాలిసా వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌ను ఆమె వివాహం చేసుకోగా, మోనాలిసా మైనర్ అంటూ ఆమె తల్లిదండ్రులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించగా.. తాను గర్భవతిని అని, ప్రయాణం చేయలేనని ఆమె పేర్కొనడం విశేషం. మోనాలిసా నిజంగానే గర్భవతా లేక విచారణ నుంచి తప్పించుకోవడానికి చెబుతున్న కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జైలు నుంచి విడుదలైన ప్రముఖ నటి
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావు ఏడాది కాలం తర్వాత పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలయ్యారు. 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించారనే ఆరోపణలో రన్యా రావు గతేడాది మార్చిలో అరెస్ట్ అయ్యారు. అయితే, ఆమె అరెస్ట్ గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు పొడిగింపు కోరకపోవడంతో.. ఆర్థిక నేరాల నియంత్రణ కోర్టు ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో సుమారు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన అనంతరం ఆమె ఎట్టకేలకు బయటకు వచ్చారు.
![]() |
![]() |