Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్..

Updated : May 7, 2026

1. శ్రీతేజ్ ఇంటికి అల్లు అర్జున్ సతీమణి..
'పుష్ప 2' ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ నివాసానికి.. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి వెళ్లారు. ప్రస్తుతం కోలుకుంటున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని.. ఆ కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ సోదరి చదువుకు అయ్యే పూర్తి ఖర్చులను తానే భరిస్తానని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. 

2. ‘ఫౌజీ’ రిలీజ్ పై కొత్త ట్విస్ట్.. 
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ‘ఫౌజీ’. సుమారు 80 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి భారీ వీఎఫ్ఎక్స్ పనులు మిగిలి ఉండటంతో.. రిలీజ్‌పై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దసరా లేదా ఈ ఏడాది చివర్లో రావాల్సిన ‘ఫౌజీ’.. 2027కు వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. 

3. ముందుగానే 'పెద్ది' సందడి..
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ వర్క్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా.. ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.

4. అల్లు అర్జున్ రాక ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం “రాకా” రిలీజ్ పై కొత్త టాక్ మొదలైంది. భారీ వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా సినిమా వచ్చే ఏడాది వేసవి తర్వాత విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పారలెల్ గా కొనసాగుతున్నాయి.

5. కార్తీ కొత్త తెలుగు మూవీ లాంచ్..
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా రూపొందనున్న కొత్త చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 'మ్యాడ్' ఫేమ్ కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

6. 'బ్లడీ రోమియో'కు బ్రేకులు..
నాని, సుజీత్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన క్రేజీ ప్రాజెక్ట్ 'బ్లడీ రోమియో' వాయిదా పడినట్లు తెలుస్తోంది. నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' ఆలస్యమవ్వడమే దీనికి కారణమని సమాచారం. ఈ గ్యాప్‌ను ఉపయోగించుకుంటూ.. సుజీత్ తన పూర్తి దృష్టిని పవన్ కళ్యాణ్ 'ఓజీ పార్ట్ 2' పనులపై మళ్లించారు. ప్రస్తుతం 'ఓజీ-2' స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. 'బ్లడీ రోమియో' ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

7. వెన్నులో వణుకు పుట్టిస్తోన్న 'అగాధ' టీజర్ 
ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ హర్రర్ థ్రిల్లర్ 'అగాధ' టీజర్ తాజాగా విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్షుద్ర పూజలు, నిగూఢమైన రహస్యాల చుట్టూ సాగుతూ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. టీజర్‌లోని విజువల్స్, భయానక వాతావరణం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో అలరించేందుకు సిద్ధమవుతోంది. 

8. 'రాజ రాజ చోర' దర్శకుడితో రవితేజ
మాస్ మహారాజా రవితేజ, యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్‌లో ఒక సినిమా రానుంది. 'రాజ రాజ చోర', 'స్వాగ్' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హసిత్ గోలి చెప్పిన వైవిధ్యమైన స్క్రిప్ట్‌కు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. ప్రస్తుతం రవితేజ 'ఇరుముడి' షూటింగ్‌లో బిజీగా ఉండగా, అది పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుంది.

9. ఓటీటీలోకి 'తిమ్మరాజుపల్లి టీవీ'
యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారిన తొలి సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ' డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. మునిరాజు దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా.. మే 15న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లు 24 గంటల ముందే, అంటే మే 14 నుంచే ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.

10. షారుఖ్-దీపికా సాంగ్ వీడియో లీక్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'కింగ్' షూటింగ్ స్పెయిన్‌లో శరవేగంగా జరుగుతుండగా, లీకుల బెడద చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి షారుఖ్ ఖాన్-దీపికా పదుకొణె పాల్గొన్న ఒక సాంగ్ షూటింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంగ్ తో పాటు కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్ లు కూడా లీక్ అయినట్లు సమాచారం.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.