Home  »  News  »  Tollywood Trending: ఎన్టీఆర్ పేరుతో మోసం.. రంగంలోకి మెగాస్టార్?

Updated : May 14, 2026

1. 'పెద్ది' కోసం రంగంలోకి 'హోంబలే ఫిల్మ్స్' 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాతో ప్రముఖ నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' అంతర్జాతీయ పంపిణీ రంగంలోకి అడుగుపెట్టింది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను హోంబలే కైవసం చేసుకుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రం, జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

2. అల్లు అర్జున్ డాన్స్ స్టెప్ కూ కాపీరైట్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 'పర్సనాలిటీ రైట్స్' రక్షణ కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తన రాబోయే చిత్రం 'రాక' నేపథ్యంలో.. తన పేరు, వాయిస్, ఇమేజ్, సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులను ఇతరులు వ్యాపార ప్రయోజనాల కోసం వాడకుండా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య ద్వారా తన బ్రాండ్ ఇమేజ్‌ను దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నారు.

3. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మూడు సర్ప్రైజ్ లు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మూడు అప్‌డేట్స్ రాబోతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' మూవీ ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది.  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే, 'దేవర 2'కి సంబంధించి కొత్త అప్‌డేట్ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

4. రంగంలోకి మెగాస్టార్?
టాలీవుడ్‌లో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుకుంటున్నాయి. పర్సంటేజీ, రెంటల్ సిస్టమ్ గొడవలు ముదురుతున్న నేపథ్యంలో.. చిరు మధ్యవర్తిత్వం వహిస్తేనే సమస్య కొలిక్కి వస్తుందని నిర్మాత నాగవంశీ వంటి వారు భావిస్తున్నారు. ముఖ్యంగా తన కుమారుడు రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. చిరంజీవి ఈ విషయంలో చొరవ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

5. బాలయ్య సినిమాలో మాస్ స్పెషల్ సాంగ్‌!
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'NBK111' నుండి అదిరిపోయే మ్యూజిక్ అప్‌డేట్ బయటకు వచ్చింది. థమన్ ఈ సినిమా కోసం ఒక హై-వోల్టేజ్ మాస్ స్పెషల్ సాంగ్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపోజింగ్ పూర్తవగా.. ఈ ఐటెం సాంగ్ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

6. ఎన్టీఆర్ పేరుతో మోసం!
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న అనధికారిక విరాళాల సేకరణపై ఆయన కార్యాలయం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ పేరు వాడుకుంటూ చారిటీ కార్యక్రమాల కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. వీటికి ఆయనతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యక్రమాలకు విరాళాలు ఇచ్చి మోసపోవద్దని ప్రజలను, అభిమానులను కోరారు.

7. 100 ఎకరాల్లో ‘కొత్త ఫిలిం సిటీ’..!
టాలీవుడ్ కి చెందిన ఒక టాప్ ప్రొడక్షన్ హౌస్.. ఇప్పుడు శంషాబాద్‌ పరిసరాల్లో సొంతంగా 'ఫిలిం సిటీ'ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేసింది.  శంషాబాద్ దగ్గర సుమారు 100 ఎకరాల భూమిని ఈ సంస్థ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక్కడ కేవలం షూటింగ్ ఫ్లోర్లు మాత్రమే కాకుండా.. వరల్డ్ క్లాస్ అవుట్‌డోర్ లొకేషన్లు, అధునాతన పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, భారీ సెట్స్ వేయడానికి వీలుగా ఓపెన్ స్పేస్‌ను డెవలప్ చేయబోతున్నారట. ప్రస్తుతం షూటింగ్స్ కోసం ఎక్కువగా 'రామోజీ ఫిలిం సిటీ'పైనే ఆధారపడుతున్న ఇండస్ట్రీకి.. ఈ కొత్త ఫిలిం సిటీ ఒక ఆల్టర్నేటివ్ కానుంది.

8. కన్నీళ్లు పెట్టుకున్న దర్శకుడు!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'కరుప్పు' సినిమా విడుదల వాయిదా పడటంతో.. దర్శకుడు ఆర్జే బాలాజీ భావోద్వేగానికి గురయ్యారు. ఆర్థిక సమస్యల కారణంగా షోలు రద్దు కావడంతో.. ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. షోలు రద్దవ్వడం పట్ల.. అభిమానులకు, ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పారు.

9. 'జన నాయగన్' వస్తున్నాడు..
తమిళనాడు సీఎం దళపతి విజయ్ తన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలపై దృష్టి సారించారు. సెన్సార్ పరమైన చిక్కులు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ పనులను వేగవంతం చేయాలని నిర్మాతలకు సూచించిన విజయ్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉన్న నిర్మాత కేవీఎన్‌ను అత్యవసరంగా పిలిపించినట్లు సమాచారం. ఈ సినిమాను విజయ్ పుట్టినరోజైన జూన్ 22న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

10. నెపోటిజంపై స్టార్ హీరో కొడుకు షాకింగ్ కామెంట్స్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్.. నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. టాలెంట్ కంటే కొన్నిసార్లు మార్కెట్ వాల్యూ, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌కే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని జునైద్ అభిప్రాయపడ్డారు. తన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఇంకా అవకాశాలు వస్తున్నాయంటే అది తన తండ్రి అమీర్ ఖాన్ కారణంగానే అన్న అర్థంలో జునైద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.