Home  »  News  »  తెలుగు సినిమా పయనం ఎటు వైపు? హీరోలు ఏం చెయ్యబోతున్నారు?

Updated : Aug 17, 2026

'ప్రేక్షకులే మా దేవుళ్లు.. వారి నవ్వులే మాకు నిజమైన రివార్డులు' అంటూ ప్రమోషన్స్‌ వేదికలపై ప్రతి స్టార్ హీరో నోటి నుంచి వినిపించే మాట ఇది. కానీ, తీరా థియేటర్‌లోకి వెళ్తే పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటోంది. గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో వస్తున్న మార్పులను గమనిస్తే ఒక ప్రశ్న స్పష్టంగా నిలదీస్తోంది. సినిమాలు తీస్తున్నది ప్రేక్షకుల వినోదం కోసమా? లేక తమ మాస్ ఇమేజ్, పాన్-ఇండియా రేంజ్,  సొంత సంతృప్తి కోసమా? ప్రేక్షకుల అభిరుచిని, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను పక్కనపెట్టి మన హీరోలు ప్రయోగాలు చేస్తున్నారు.

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే హాయిగా నవ్వుకునే హాస్యం, గుండెలను పిండేసే అనుబంధాలు, భావోద్వేగాలు నిండిన కుటుంబ కథా చిత్రాలు రాజ్యమేలేవి. పండగొచ్చినా, వీకెండ్ వచ్చినా ఇళ్లల్లోని పెద్దలు, పిల్లలు, మహిళలంతా కలిసి థియేటర్ వైపు అడుగులు వేసేవారు. కానీ నేటి పరిస్థితి చూస్తే.. కుటుంబంతో కలిసి చూసేందుకు వీలైన సినిమాలు ఏడాదిలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయికి పడిపోయాయి. స్క్రీన్ పై పదే పదే కత్తి పట్టి నరకడం, రక్తం ఏరులై పారడం, ఊచకోతలు కోయడమే ఒక ఉద్యమంగా మారిపోయింది.

మరోవైపు, "థియేటర్లకు జనాలు రావడం లేదు.. ఓటీటీల వల్లే బాక్సాఫీస్ దెబ్బతింటోంది" అంటూ నిర్మాతలు, దర్శకులు తరచూ గగ్గోలు పెడుతుంటారు. కానీ, అసలు నిజం ఏమిటంటే.. మితిమీరిన హింస, అశ్లీలత కారణంగా కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ఇండస్ట్రీయే స్వయంగా అడ్డుకుంటోంది. పిల్లలతో కలిసి థియేటర్‌కు వెళ్లి గంటన్నర పాటు రక్తపాతం చూసి భయపడటం కంటే, హాయిగా ఇంట్లోనే ఓటీటీలో పాత సినిమాలు లేదా పద్ధతిగల షోలు చూసుకోవడమే నయమని ఫ్యామిలీ ఆడియన్స్ భావిస్తున్నారు.

పెద్ద హీరోలు సైతం తాము సేఫ్ జోన్ వీడుతున్నామని చెప్తూ మాస్, డార్క్, రా-అండ్-రస్టిక్ కాన్సెప్టుల వైపే మొగ్గు చూపుతున్నారు. 100 కోట్ల బడ్జెట్లతో నిర్మించే చిత్రాల్లో గ్రాఫిక్స్, న‌ర‌క‌డాలు, యాక్షన్ డిజైన్‌పై పెడుతున్న శ్రద్ధ.. కథలో ఉండాల్సిన హృదయాన్ని తాకే సీన్ల పై పెట్టడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. క్లాస్, ఫ్యామిలీ డ్రామాలను కేవలం చిన్న సినిమాలకే పరిమితం చేసి, స్టార్ హీరోలంతా 'కత్తుల సవాల్' కే జై కొడుతున్నారు.

మాస్ ఆడియ‌న్స్‌ను అలరించడం ఎంత అవసరమో, కనీస వినోదాన్ని పంచుతూ హాయిగా సాగే చిత్రాలను అందించడం కూడా అంతే ముఖ్యం. 'ప్రేక్షకుడే దేవుడు' అనే పదాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా, మళ్లీ కుటుంబాలు హాయిగా థియేటర్లలో నవ్వుకునే రోజుల్ని తీసుకురావాల్సిన బాధ్యత మన దర్శకులు, హీరోలపై ఎంతైనా ఉంది.

ఈ వైలెన్స్ ట్రెండ్ ఎన్నాళ్లు సాగుతుంది? ఫ్యామిలీ ఆడియన్స్ నిరాదరణ బాక్సాఫీస్‌పై లాంగ్ రన్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది రాబోయే రోజుల్లో టాలీవుడ్ కచ్చితంగా ఆలోచించాల్సిన అంశం.

 

Tollywood Extreme Violence Movies, Telugu Family Entertainer Movies, Tollywood Star Heroes Movies, Telugu Cinema Box Office Trends, Family Audience Theatre Footfalls






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.