![]() |
![]() |
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయాలు సాధిస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. కానీ నాణేనికి మరోవైపు ఉన్నట్లు.. ఈ భారీ విజయాల వెనుక నిర్మాతలు మోస్తున్న బడ్జెట్ భారం టాలీవుడ్‌ను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తోంది. 'పాన్ ఇండియా' ట్రెండ్ పేరుతో ప్రతి సినిమాకు వందల కోట్లు కుమ్మరించడం ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక పెద్ద సవాల్‌గా మారింది. విజువల్ వండర్స్, భారీ సెట్స్, వీఎఫ్ఎక్స్ హంగుల కోసం పెడుతున్న ఖర్చు నిర్మాతలకు తడిసి మోపెడవుతోంది.
ఒకప్పుడు ఏడెనిమిది నెలల్లో పూర్తయ్యే సినిమాలు, ఇప్పుడు రెండేళ్ల నుంచి మూడేళ్ల పాటు సాగుతున్నాయి. షూటింగ్ ఆలస్యమయ్యే కొద్దీ ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో పాటు వడ్డీల భారం కూడా ఎక్కువవుతోంది. దీనికి తోడు సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా వాటా కేవలం హీరో, దర్శకుడి రెమ్యునరేషన్లకే సరిపోతుండటం గమనార్హం. కొందరు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తుండటంతో స్టార్స్ చిత్రాల బడ్జెట్ ఏకంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు చేరుకుంటోంది.
ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే.. మార్కెట్ లేని, కనీసం వంద కోట్ల వసూళ్ల ట్రాక్ రికార్డ్ లేని యంగ్ హీరోల సినిమాలకు కూడా వందల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారు. క్రేజ్ లేని సినిమాలపై ఇంత భారీగా పెట్టుబడి పెట్టడం నిర్మాతలకు కోలుకోలేని దెబ్బగా మారుతోంది. మరోవైపు ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా సులువుగా సాగడం లేదు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆశించిన స్థాయిలో అమ్ముడుపోకపోతే థియేట్రికల్ రిలీజ్ చేయడం కూడా గగనమైపోతోంది. ప్రస్తుతం భారీ అంచనాలతో వస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా ఈ విధమైన బిజినెస్ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇలా పెరిగిపోయిన బడ్జెట్‌ను రికవరీ చేయడానికి మేకర్స్ థియేటర్లలో టికెట్ల రేట్ల పెంపుపై ఆధారపడుతున్నారు. కానీ ఈ నిర్ణయం కాస్త రివర్స్ కొడుతోంది. టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకపోవడంతో, ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనకాడుతున్నారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దలు కళ్ళు తెరిచి బడ్జెట్లను అదుపులో పెట్టుకోకపోతే, భవిష్యత్తులో టాలీవుడ్ మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా కథకు తగ్గ బడ్జెట్‌తో సినిమాలు ప్లాన్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |