![]() |
![]() |

ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్‌డౌన్ తప్పదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. నెలాఖరున మళ్లీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతానికి పక్కన పెడితే... లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత వెంటనే థియేటర్లు ఓపెన్ చేస్తారా? లేదా? అనేది తెలుగు సినిమా నిర్మాతలను తొలుస్తున్న ప్రశ్న. ఒకవేళ ఓపెన్ చేస్తే... సినిమాలు చూడడానికి ఇంతకు ముందు వచ్చినట్టు ప్రేక్షకులు వస్తారా? రారా? అనేది సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలింది. కరోనా సృష్టించిన కల్లోలం కారణంగా సాధారణ పరిస్థితులు ఎప్పటికి నెలకొంటాయో తెలియని పరిస్థితి. అందుకని, జూన్ వరకు థియేటర్లు బంద్ చేస్తే బాగుంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. జూన్ తర్వాత థియేటర్లు ఓపెన్ చేసి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటున్నారట.
థియేటర్లు బంద్ కావడంతో ఆల్రెడీ విడుదలకు సిద్ధమైన సినిమాలకు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి. అలాగని, ఓటీటీకి సినిమాలు ఇచ్చేస్తే... థియేటర్లు ఓపెన్ చేసిన తర్వాత నష్టాలు వస్తాయనీ, ఇండస్ట్రీకి కష్టమవుతుందనీ నిర్మాతల మధ్య జరిగిన చర్చల్లో అనుకున్నారట. దిల్ రాజు నిర్మించిన 'వి'కి ఓటీటీ నుండి ఆఫర్ ఉంది. ఇప్పుడు సినిమా ఇస్తే... రేపు థియేటర్లలో సరైన సినిమాలు రాకపోతే ఆయనకు నష్టాలు రావచ్చు. ఎందుకంటే... దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ కూడా. ఆయన దగ్గర కొన్ని థియేటర్లు ఉన్నాయి. అల్లు అరవింద్, సురేష్ బాబు వంటి నిర్మాతలు కూడా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. వాళ్ళ ప్రొడక్షన్ హౌస్‌లలో కొన్ని సినిమాలు ఉన్నాయి. థియేటర్ల సమస్యను దృష్టిలో పెట్టుకుని ఓటీటీకి సినిమాలు ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నారట. ఇంకా అల్లు అరవింద్ 'ఆహా' ఓటీటీ స్టార్ట్ చేశారు. 'ఆహా' కోసం స్పెషల్ గా వెబ్ సిరీస్, ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
![]() |
![]() |