![]() |
![]() |

తమిళ చిత్రసీమలోని స్టార్ యాక్టర్లలో విక్రమ్ ఒకడు. ప్రస్తుతం ఆయన 'కోబ్రా' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే లేటెస్ట్గా ఆయన సినిమాల నుంచి తప్పుకోబోతున్నాడంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారంలోకి వచ్చింది. 'కోబ్రా' సినిమా రిలీజయ్యాక ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి, కొడుకు ధ్రువ్ కెరీర్‌పై దృష్టి పెట్టనున్నాడనేది ఆ ప్రచారం సారాంశం. ఈ ప్రచారానికి కారణమైంది ఒక పేరుపొందిన తమిళ పత్రికలో వచ్చిన వార్త. ఇది విక్రమ్ ఫ్యాన్స్‌లో తీవ్ర సంచలనం కలిగించడమే కాక, వారిని ఆందోళనలో పడేసింది. విక్రమ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావట్లేదంటూ వాళ్లు సోషల్ మీడియాను హోరెత్తించారు. దీంతో విక్రమ్ పీఆర్వో రంగంలోకి దిగి, విక్రమ్ సినిమాలకు దూరమవనున్నారనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ప్రకటించారు.
"యాక్టర్ చియాన్ విక్రమ్ గురించి ఒక పేరుపొందిన మీడియాలో ప్రచురితమైన వార్తలో ఏమాత్రం నిజం లేదు. అది పూర్తిగా నిరాధారమైంది. ప్రస్తుతం విక్రమ్ కోబ్రా సినిమా చేస్తున్నారు. ఆ వెంటనే మణిరత్నం సినిమా, దాని తర్వాత సెవన్ స్క్రీన్ స్టూడియోస్ లలిత్‌తో ఒక సినిమా చేయనున్నారు" అని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ వివరణతో విక్రమ్‌పై వస్తున్న నిరాధార వార్తలు, వదంతులకు ఫుల్స్టాప్ పడుతుందేమో చూడాలి.
![]() |
![]() |