![]() |
![]() |

భారతదేశం గర్వించదగ్గ సినీ దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ఆయన మేధస్సు నుంచి ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు పుట్టాయి. ఆయన రూపొందించిన సినిమాల్లో కొన్ని కమర్షియల్‌గా వైఫల్యం చెంది ఉండొచ్చు కానీ, ఆ చిత్రాల్లోని ప్రతి ఫ్రేములోనూ ఆయన దర్శకత్వ ప్రతిభకు, సృజనశక్తికి నిదర్శనంగా కనిపిస్తుంది. మూడేళ్ల క్రితం ఆయన డైరెక్ట్ చేసిన చిత్రం' కాట్రు వెలియిడై'. కార్తీ, అదితి రావ్ హైదరి జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. తెలుగులో ఈ సినిమాను 'చెలియా' పేరుతో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఇక్కడా ఆడలేదు. కానీ ఈ సినిమాకు ఇచ్చిన సంగీతంతో ఎ.ఆర్. రెహమాన్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, తమిళ ఒరిజినల్‌లో ఒక పాట పాడిన గాయని షషా తిరుపతి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డులు అందుకున్నారు. విమర్శకుల్ని మాత్రం ఈ సినిమా ఆకట్టుకుంది.
'కాట్రు వెలియిడై' 2017 ఏప్రిల్ 7న విడుదలైంది. అంటే నేటికి మూడేళ్లు. ఈ సందర్భంగా ఆ చిత్ర నాయిక అదితి రావ్ హైదరి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రియురాలికి ప్రియుడు లవ్ ప్రపోజ్ చేసే తరహాలో నిల్చొనివున్న మణిరత్నంకు మోకాలిపై కూర్చున్న అదితి ఆయనకు గులాబీ పువ్వును అందిస్తోంది. మణిరత్నం మాత్రం ఆ పువ్వును అందుకోకుండా, ఒక చేతిని ప్యాంటు జేబులో, ఇంకో చేతిని అదితి గడ్డంపై పెట్టి నవ్వుతున్నారు. ఆ ఫొటోకు "మణి సార్.. కలలు నిజమవుతాయని నేను నమ్మడానికి కారకులు" అనే క్యాప్షన్ జోడించింది.
అదితి రావ్ తెలుగులో 'అంతరిక్షం', 'సమ్మోహనం' చిత్రాలు చేసింది. ప్రస్తుతం నాని, సుధీర్‌బాబు కాంబినేషన్ మూవీ 'వి'లో నటిస్తోంది.

![]() |
![]() |