Home  »  News  »  పసుపులేటి రామారావు మృతికి చిరంజీవి దిగ్భ్రాంతి!

Updated : Feb 11, 2020

 

నాలుగున్నర దశాబ్దాల పాటు సినీ జర్నలిస్టుగా సేవలందించిన పసుపులేటి రామారావు తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరాక ముందు నుంచే, మద్రాసులోనే 20 ఏళ్ల పాటు ఉండి సినీ జర్నలిస్టుగా సినిమా సమాచారంతో పాటు అనేకమంది ప్రముఖుల ఇంటర్వ్యూలు, తెలుగు సినిమా పరిణామక్రమాన్ని సూచించే అనేక వ్యాసాలు అందించారు. పలు నిర్మాణ సంస్థలకు పీఆర్వోగా కూడా ఆయన పనిచేశారు. ఎప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన సంచీతో కనిపించేవారు.

మెగాస్టార్ చిరంజీవికి ఆయన అత్యంత సన్నిహితులు. ఆంద్రపత్రిక, జ్యోతిచిత్ర, సంతోషం వంటి పత్రికల్లో ఆయన పనిచేశారు. కొన్ని పుస్తకాలను ప్రచురించారు. 'చిరంజీవితం', 'వెండితెర అరుణకిరణం.. టి. కృష్ణ' 'అద్భుతనటి సావిత్రి.. తెరవెనుక నిజానిజాలు', 'అతిలోకసుందరి శ్రీదేవి కథ', 'తెరవెనుక దాసరి', 'ఎస్వీ రంగారావు సమగ్ర సినీ జీవితం' తదితర ఆసక్తికర పుస్తకాలున్నాయి. ఇటీవలే చిత్రసీమలో తన సొంత అనుభవాలను కూర్చి '46 సంవత్సరాల సినీ ప్రస్థానంలో పదనిసలు' పేరుతో ఒక పుస్తకం ప్రచురించారు. అనారోగ్యం వల్లే దాన్ని ఆవిష్కరణ సభ జరపకుండా నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. చిరంజీవిని, ఆయన కుటుంబాన్ని విపరీతంగా అభిమానించే రామారావు తనకు లేకలేక పుట్టిన కుమారుడికి మెగా బ్రదర్స్ ముగ్గురు పేర్లు కలిపి 'కల్యాణ్ నాగ చిరంజీవి' అని పేరు పెట్టారు. ఆయన మృతిపట్ల చిరంజీవి సహా పలువురు ప్రముఖులు, నిర్మాణ సంస్థలు సంతాపం ప్రకటించారు.

రామారావు నా ఆత్మబంధువు.. ఆ కుటుంబానికి అండగా ఉంటా: చిరంజీవి
పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సీనియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు. "ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్‌షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను. మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగారికి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా  పేరు పెట్టాడు. ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను. వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని మీడియాకు సంతాప సందేశం పంపించారు.
రామారావు మృతిపట్ల సంతాపం తెలిపినవారిలో నందమూరి కల్యాణ్ రామ్, నాని, వరుణ్ తేజ్, హరీష్ శంకర్ తదితరులు ఉన్నారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.