![]() |
![]() |

కొత్త కాంబినేషన్లో సినిమా మొదలైందనుకోండి. అందునా.. హీరోగారూ, దర్శకులవారూ ఇద్దరూ స్టార్లేననుకోండి. ఇక అభిమానులకు ఆ సినిమాపై ఎన్ని ఊహలో! ఎన్ని ఊసులో! ఆ దర్శకుడి సినిమాలు అలా ఉంటాయ్. మన హీరో పాత్రలు ఇలా ఉంటాయ్. మనవాడ్ని అలా చూపిస్తాడా? మన హీరో ఈ సినిమా కోసం ఇలా మారతాడా? అబ్బబ్బబ్బా... ఎన్ని ప్రశ్నలూ, ఇంకెన్ని సమాధానాలూ!. సినిమా వచ్చేంతవరకూ ఊహా విహర విహంగమే. తీరా విడుదలయ్యాక.. సదరు దర్శకుని పంథాలో కొత్తగా మారిన తన హీరోను చూసి.. ఒక్కోసారి మురిసిపోతారు. ఒక్కోసారి మూర్చబోతారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఏది ఏమైనా... కొత్త కాంబినేషన్ కిక్కే వేరబ్బా. ఇప్పుడీ గోలంతా దేనికీ? అనేగా మీ ప్రశ్న? విషయం ఏంటంటే... ఓ కొత్త కాంబినేషన్ త్వరలో మొగ్గ తొడగబోతోంది. అదేనబ్బా... ఎన్టీయార్-త్రివిక్రమ్ సినిమా! నవంబర్లో ఈ సినిమా సెట్స్ కి వెళుతుందట.
ఈ మధ్యే... తారక్ కు త్రివిక్రమ్... ఈ స్టోరీని కూడా నేరేట్ చేసేశాట్ట. బుడ్డోడు కూడా ఫుల్ హ్యాపీ. హాసినీ, హారికా పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. విషయం అయితే.. అది. ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. ఇప్పటివరకూ ఈ సినిమా షూటింగే మొదలవ్వలేదు. సినిమా ఎలా ఉండబోతోంది? త్రివిక్రమ్ సినిమాలు ‘అలా’ ఉంటాయ్. త్రివిక్రమ్ హీరోలు ‘అలా’ అంటారు. మరి మన హీరోను కూడా త్రివిక్రమ్ ‘అలా’గే చూపిస్తాడా? అంటూ ఒకటే చర్చోపచర్చలు. అందుకే... అసలు త్రివిక్రమ్ సినిమాలెలా ఉంటాయ్? తారక్ పాత్రలెలా ఉంటాయ్? వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? అనే విషయాలను కాసేపు ముచ్చటించుకుందాం.
త్రివిక్రమ్:-
నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయ్, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అ ఆ. ఇవబ్బా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు. ఈ సినిమాలన్నింటిలో హీరో పాత్రలు చూస్తే మనకు అర్థమయ్యేందేంటంటే.. చురుకైన వాడు. చలాకీగా ఉంటాడు. స్పాంటేనియస్ గా పంచ్ లు వేసేస్తాడు. మళ్లీ ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు. అసలు నిజం ఏంటంటే... ఆదమరచి ఉంటే అవయవాలు కోసుకెళ్లిపోతాడు. వాడే త్రివిక్రమ్ హీరో. డౌటా?.. కావాలంటే.. ఓ సారి త్రివిక్రమ్ సినిమాలు చూస్కోండి.
ఎన్టీయార్:-
ఇప్పటికి హీరోగా 27 సినిమాలు చేశాడు. ‘ఆది’ నుంచి ‘అశోక్’ దాకా చేసిన తొమ్మిది సినిమాలూ... ఊర మాస్. రావడంతోనే రౌద్ర రసంతో రఫ్పాడించేశాడనుకోండి. ఆ తర్వాత వచ్చింది‘రాఖీ’. రౌద్రంతో, విషాదం జతకలిసింది.
ఇక ‘యమదొంగ’. అక్కడ్నుంచి కొత్త ఎన్టీయార్ అవతరించాడు. సన్నగా. నాజూగ్గా.. కొంటెగా, చలాగ్గా.. కామెడీతో కూడా కనువిందు చేస్తూ... పూర్తిస్థాయ కమర్షియల్ హీరోగా అవతరించాడు తారక్. ఇది ‘రభస’ దాకా సాగింది.
‘టెంపర్’... ఇదో కొత్త యాంగిల్. తారక్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? అని అవాక్కయ్యారంతా. వెధవతనాన్ని కూడా ఇంత గొప్పగా చూపించిన హీరో లేడంటే నమ్మండి. నిజంగా టెంపర్ పుట్టించేశాడు. ఆ తర్వాత ‘నాన్నకు ప్రేమతో’.. ఇది మరో కోణం. తెలివైన శత్రువు పాత్ర. స్టైలిష్ లుక్, స్టైలిష్ పెర్ ఫార్మెన్స్. అంతర్లీనంగా భావోద్వేగం.. ఓ కొత్త తారక్ కనిపించాడు. రీసెంట్ గా ‘జనతాగ్యారేజ్’. ఇందులో కూడా విభిన్న కోణాలుంటాయ్. త్వరలో వస్తున్న ‘జై లవకుశ’లో అయితే.. ఏకంగా మూడు పాత్రలు. ఒకదానితో ఒకటి పొంతన ఉండదట. మొత్తంగా చెప్పేదేంటంటే... త్రివిక్రమ్ హీరోలోని లక్షణాలన్నింటినీ... విడివిడిగా. సందర్భానుసారం తారక్ వాడేశాడు. ఆ మాటకొస్తే.. త్రివిక్రమ్ హీరోల్లో కనబడని క్వాలిటీలు కూడా తారక్ పాత్రల్లో కనిపిస్తాయ్. బేసిగ్గా హీ ఈజ్ గుడ్ యాక్టర్. ‘ఇప్పుడున్న హీరోల్లో నటన పరంగా తారక్ బెస్ట్’ అని శోభన్ బాబు లాంటి పెద్దలే ప్రశసించారు. అది ‘ఎన్టీయార్’ అంటే. అసలు ఆ పేరులోనే ఉందిలే మాయ.. మహత్తు. సో... త్రివిక్రమ్ తన గత హీరోల్లాగే తారక్ ని చూపిస్తే ‘ఓకే’. అలా కాకుండా కొత్త హీరోని క్రియేట్ చేస్తే ‘డబుల్ ఓకే’. దర్శకుడిలో క్రియేషన్, విజన్ ఉన్నప్పుడు.. హీరోలో ప్రతిభ ఉన్నప్పుడు ప్రేక్షకుల అభిరుచికి కొదవేం ఉంటుంది చెప్పండి?
- నరసింహ బుర్రా
![]() |
![]() |