Home  »  News  »  పొంగల్ బరిలో టాలీవుడ్ టాప్ స్టార్స్.. క్యూ కడుతున్న క్రేజీ టైటిల్స్!

Updated : Aug 19, 2026

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి పండుగ సీజన్ సృష్టించే హంగామా, తీసుకొచ్చే కలెక్షన్ల సునామీ ఏ వేరే స్థాయి. ఒకప్పుడు సంక్రాంతితో పాటు సమ్మర్, దసరా, క్రిస్మస్ పండుగలకు పెద్ద సినిమాలు క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలందరి చూపు ఒక్క సంక్రాంతి బరిపైనే కేంద్రీకృతమైంది. ఈ పెద్ద పండుగ రేసులో పోటీ పడేందుకు సీనియర్ స్టార్ల నుంచి యంగ్ హీరోల వరకు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాబోయే పొంగల్ బరిలో నిలవబోతున్న సినిమాల టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆయా హీరోల లక్, సంక్రాంతి సెంటిమెంట్ కలగలిపి రూపుదిద్దుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ల వివరాలు సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

మెగాస్టార్ చిరంజీవికి సంక్రాంతి సీజన్ అనేది ఎప్పుడూ ఒక తిరుగులేని సెంటిమెంట్. రాజకీయం నుంచి మళ్లీ వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు బంపర్ హిట్లు అందించిన 'ఖైదీ నంబర్ 150', 'వాల్తేరు వీరయ్య', 'మన శంకరవరప్రసాద్ గారు' వంటి భారీ చిత్రాలన్నీ పొంగల్ రేసులోనే వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అందుకే దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న తన రెండో సినిమాను కూడా మెగాస్టార్ సంక్రాంతికే థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి 'కదిరి నరసింహుడు' లేదా 'కాకాజీ' అనే ఆసక్తికరమైన టైటిల్స్ ప్రచారంలోకి రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక సంక్రాంతి సక్సెస్ హీరోగా పేరు తెచ్చుకున్న విక్టరీ వెంకటేష్ కూడా మళ్లీ అదే దారిలో వస్తున్నారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 2025లో ఘన విజయం సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే జోష్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వెంకటేష్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీని పొంగల్ బరిలోకి దింపుతున్నారు. ఈ సినిమాకి 'జనవరి 12 విడుదల' అనే వినూత్నమైన టైటిల్‌ను ఖరారు చేయగా, 'బావా బామ్మర్ది సౌజన్యంతో' అనేది టాగ్ లైన్‌గా పెట్టడం విశేషం. చిత్ర పేరులోనే ఉన్న రిలీజ్ డేట్ ప్రకారమే సరిగ్గా జనవరి 12వ తేదీనే థియేటర్లలోకి తెస్తుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది.

మరోవైపు మాస్ మహారాజా రవితేజ కూడా సంక్రాంతి పోటీలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయినప్పటికీ, పొంగల్ హంగామాను వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈ సారి రవితేజ, యంగ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు 'వీరాధివీరులంట' లేదా 'మహిళామిత్ర మండలి తాలూకా' అనే విభిన్నమైన టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.

వీరితో పాటు మిగిలిన స్టార్ హీరోలు కూడా భారీ ఆశలతో పొంగల్ బరిలోకి దిగుతున్నారు. కింగ్ నాగార్జున తన ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం 'లాటరీ కింగ్' తోనూ, యంగ్ హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' తోనూ, ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వస్తున్న విజువల్ వండర్ 'మహాకాళి' కూడా పండుగ రేసులోనే సందడి చేయనున్నాయి. ఇక సాయిదుర్గా తేజ్ తొలిసారిగా తన 'సంబరాల ఏటిగట్టు' చిత్రంతో సంక్రాంతి బరిలోకి దూకుతుండటం విశేషం. వీరందరిలో సాయిదుర్గా తేజ్ తప్ప మిగిలిన హీరోలందరూ ఇప్పటికే సంక్రాంతికి వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్లు చూసినవారే. మరి ఈ స్టార్ల మధ్య నడిచే పొంగల్ సమరంలో ఏ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుని సంక్రాంతి విజేతగా నిలుస్తుందో వేచి చూడాలి.

 

Tollywood Pongal Race, Chiranjeevi New Movie Title, Venkatesh January 12 Vidudala, Sankranthi Movies 2026, Nagarjuna Lottery King, Ravi Teja New Film






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.