![]() |
![]() |

చెవిలో కాలీఫ్లవర్ ఏమైనా కనపడుతుందా అనే ఒకే ఒక డైలాగ్ తో తెలుగు నాట పాపులర్ అయిన లెజండ్రీ యాక్టర్ పరేష్ రావల్.. ఎన్నో వైవిద్యమైన క్యారెక్టర్స్ తో ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కామెడీ టైమింగ్ కి అయితే తిరుగులేదు. శంకరదాదా ఎంబిబిఎస్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి లింగం మావయ్యగా కూడా ఫుల్ పాపులర్ అయ్యాడు. ఆయన రియల్ లైఫ్, ఆయన కుటుంబ నేపథ్యం గురించి చాలా మందికి తక్కువగా తెలుసు. ముఖ్యంగా వైఫ్ స్వరూప్ సంపత్ ఒకప్పుడు భారతదేశాన్ని ఏలిన అందాల రాశి, మాజీ మిస్ ఇండియా విజేత అనే విషయం చాలా మందికి తెలియదు.
కేవలం సౌందర్యంలోనే కాకుండా విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆమె జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ అరుదైన ప్రేమకథ 1975వ సంవత్సరంలో ముంబైలోని ఒక నాటక ప్రదర్శనలో ప్రారంభమైంది. కళాశాల రోజుల్లో నాటకాల్లో చురుగ్గా పాల్గొనే పరేష్ రావల్ తొలిచూపులోనే స్వరూప్ సంపత్‌ను చూసి ప్రేమలో పడ్డారు. ఆ సమయంలో ఆమె నాటక నిర్వాహకుని కుమార్తె కావడంతో స్నేహితులు హెచ్చరించినప్పటికీ, పరేష్ మాత్రం "ఆమె ఎవరి కుమార్తె అయినా సరే, నేను మాత్రం ఆమెనే పెళ్లి చేసుకుంటాను" అని ధైర్యంగా ప్రకటించారు. పరేష్ నటనను చూసి ముగ్ధురాలైన స్వరూప్ కూడా ఆయనతో స్నేహాన్ని పెంచుకున్నారు. వీరిద్దరి అభిరుచులు, నాటకరంగం పట్ల ఉన్న ప్రాణం వారిని మరింత దగ్గర చేశాయి. కొద్దికాలానికే, స్వరూప్ తండ్రి ప్రోత్సాహంతో మిస్ ఇండియా పోటీలలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అయితే ప్రారంభంలో ఆమెకు కొంత సంకోచం ఉన్నప్పటికీ, పరేష్ రావెల్ ఇచ్చిన ధైర్యం, మద్దతు ఆమెని ముందుకు నడిపాయి.
ఫలితంగా 1979వ సంవత్సరంలో స్వరూప్ సంపత్ 'ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్' కిరీటాన్ని కైవసం చేసుకుని, 1979 మిస్ యూనివర్స్ పోటీలలో భారత ప్రతినిధిగా నిలిచారు. మోడలింగ్ రంగుల ప్రపంచంలో ప్రవేశించిన తర్వాత కూడా వీరి అనుబంధం చెక్కుచెదరలేదు. సుదీర్ఘంగా 12 సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించిన ఈ జంట, 1987వ సంవత్సరంలో ఎంతో నిరాడంబరంగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సినిమా రంగంలో స్వరూప్ సంపత్ తనదైన ముద్ర వేశారు. 1981లో విడుదలైన 'నరమ్ గరమ్', 'నాఖుదా' చిత్రాలతో పాటు, 1983 నాటి 'హిమ్మత్‌వాలా', 1984లో వచ్చిన 'కరిష్మా' వంటి ప్రసిద్ధ చిత్రాలలో ఆమె కీలక పాత్రలు పోషించారు. అలాగే 1984లో ప్రసారమైన అత్యంత ప్రజాదరణ పొందిన కామెడీ సీరియల్ 'యే జో హై జిందగీ' ద్వారా బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. తదనంతర కాలంలో 'సాథియా' (2002), 'కీ అండ్ కా' (2016), 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (2019) వంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే కేవలం వెండితెర గ్లామర్‌కే పరిమితం కాకుండా, విద్యా రంగంలో స్వరూప్ అద్భుతమైన కృషి చేశారు.
Also read: ఇదేనా!.. రాజకీయాల్లోకి వచ్చే సినీ లిస్ట్
పిల్లల పెంపకం, విద్య మరియు సమాజ సేవపై దృష్టి సారించిన ఆమె, యూకేలోని విశ్వఖ్యాత 'యూనివర్సిటీ ఆఫ్ వోర్సెస్టర్' నుంచి విద్యారంగంలో పీహెచ్‌డీ (PhD) పట్టా సాధించి 'డాక్టర్ స్వరూప్ సంపత్'గా మారారు. నేర్చుకునే వైకల్యాలు ఉన్న పిల్లల కోసం నాటకాలను బోధనా సాధనంగా ఉపయోగించడంపై ఆమె పరిశోధనలు చేశారు.నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, పిల్లల కోసం ప్రత్యేక విద్యా కార్యక్రమానికి అధిపతిగా స్వరూప్‌ను ఎంపిక చేశారు. అంతేకాకుండా, గ్లోబల్ టీచర్ ప్రైజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 179 దేశాల నుండి వచ్చిన 10,000 కంటే ఎక్కువ నామినేషన్లలో స్వరూప్ సంపత్ టాప్ 10 గ్లోబల్ ఫైనలిస్టులలో ఒకరిగా నిలిచి భారతదేశ కీర్తిని అంతర్జాతీయ వేదికపై చాటిచెప్పారు. ప్రస్తుతం ఈ దంపతులకు అనిరుద్ధ్, ఆదిత్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్లామర్ ప్రపంచాన్ని ఏలి, ఆ తర్వాత విద్యావేత్తగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన స్వరూప్ సంపత్ జీవితం నిజంగా అభినందనీయం.
Paresh Rawal, Swaroop Sampat, Tollywood

![]() |
![]() |