Home  »  News  »  స్పైడర్ మేన్ నటి మృతి.. ఆలస్యంగా వెలుగులోకి రావడానికి కారణం ఇదే

Updated : Aug 4, 2026

 

సోషల్ మీడియా ఉదృతి తీవ్రంగా ఉన్న ఈ రోజుల్లో కూడా ఈ మధ్య చాలా మంది నటీనటుల మరణాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.  ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సినిమా ప్రియుల హృదయాలను గెలుచుకున్న హాలీవుడ్  సీనియర్ నటి మేరీ రివెరా (Mary Rivera)ఇకలేరు.

 ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించిన మార్వెల్ బ్లాక్ బస్టర్ చిత్రం 'స్పైడర్ మేన్: నో వే హోమ్' (Spider-Man: No Way Home) లో నెడ్ లీడ్స్ అమ్మమ్మగా (లోలా) నటించి మెప్పించిన మేరీ, 82 ఏళ్ల వయస్సులో హవాయిలోని హానోలులులో తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే హాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మార్వెల్ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ ప్రియమైన 'లోలా'కి అశ్రునయనాలతో నివాళులర్పిస్తున్నారు.  మేరీ రివెరా ఏప్రిల్ 15, న తన నివాసంలో  కన్నుమూశారని ఆమె కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆమె మరణానికి గల అసలు కారణాలను వివరిస్తూ, ఇటీవల మేరీ రివెరా హఠాత్తుగా తీవ్రమైన పక్షవాతానికి (Stroke) గురవ్వడంతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో  తీవ్ర అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో వైద్యులు ఆమెను వెంటిలేటర్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి ఎంతకీ కుదుటపడలేదు. ఒకవేళ కోమా నుంచి బయటకు వచ్చినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేయడంతో, కుటుంబ సభ్యులు బరువైన  హృదయంతో ఆమెను లైఫ్ సపోర్ట్ నుండి తొలగించేందుకు అంగీకరించారు. 

 జూన్ 2, 1943న ఫిలిప్పీన్స్ లోని ఐలోయిలో (Iloilo) ప్రాంతంలో జన్మించిన మేరీ రివెరా జీవితంలో ఎక్కువ భాగం చర్చి మిషనరీగా ఆధ్యాత్మిక సేవలు అందించారు. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నటన వైపు అడుగులు వేసిన ఆమె, 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'స్పైడర్ మేన్: నో వే హోమ్' సినిమా కోసం ఆడిషన్ ఇచ్చి నెడ్ అమ్మమ్మ పాత్రకు ఎంపికయ్యారు. తక్కువ నిమిషాలు మాత్రమే తెరపై కనిపించినప్పటికీ, తన సహజమైన నటన, ప్రత్యేకమైన టైమింగ్ తో గ్లోబల్ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించారు.  ముఖ్యంగా ఆ సినిమాలో ఆండ్రూ గార్‌ఫీల్డ్ స్పైడర్ మేన్ అవతారంలో నెడ్ ఇంట్లోని పోర్టల్ ద్వారా ప్రవేశించే సన్నివేశం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గది సీలింగ్‌పై వేలాడుతున్న ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ను చూసి బెదిరిపోకుండా, తన మాతృభాష అయిన 'తగలోగ్' (Tagalog) లో మాట్లాడటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. "అక్కడే పైనే ఉన్నావు కదా, కొంచెం మూలలో ఉన్న బూజు తుడిచేయ్" అంటూ ఆమె చెప్పే కామిక్ డైలాగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. 


Also read: Prabhas: ప్రభాస్ కోసం గచ్చిబౌలికి చార్మినార్  

ఈ ఒక్క సన్నివేశం హాలీవుడ్ పెద్ద తెరపై ఫిలిప్పీన్స్ సంస్కృతిని, భాషను ఎంతో గర్వంగా ఆవిష్కరించింది.  టామ్ హాలండ్, ఆండ్రూ గార్‌ఫీల్డ్, టోబీ మాగ్వైర్, జెండయా, జేమీ ఫాక్స్ వంటి హాలీవుడ్ అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకున్న మేరీ రివెరాకు భర్త అలెజాండ్రో రివెరాతో పాటు నలుగురు పిల్లలు (కార్మెలా జెన్స్, పాల్ రివెరా, ఎడ్విన్ రివెరా, ఏంజెలా కెల్లీ), 11 మంది మనవళ్లు, మనవరాళ్లు, అలాగే నలుగురు మునిమనవళ్లు ఉన్నారు. మేరీ రివెరా భౌతికకాయం మన మధ్య లేకపోయినా, 'స్పైడర్ మేన్' చిత్రంలో ఆమె పోషించిన నెడ్ 'లోలా' పాత్ర ప్రపంచవ్యాప్త మార్వెల్ ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.

Spider Man No Way Home, Mary Rivera

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.