Home  »  News  »  పావలా శ్యామల కుటుంబానికి దర్శకుల సంఘం ఆర్థిక సాయం.!

Updated : Jul 29, 2026

తనదైన సహజసిద్ధమైన హాస్యంతో, వైవిధ్యమైన క్యారెక్టర్ రోల్స్‌తో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటి పావలా శ్యామల (75) మృతి చెందడం టాలీవుడ్‌ను తీవ్ర విచారంలో ముంచెత్తింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 1:52 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నాలుగు పదుల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన శ్యామల, చివరి రోజుల్లో అత్యంత దీనస్థితిలో కాలం వెళ్లదీయడం చిత్రసీమలోని పలువురిని కలచివేసింది.

ఆమె మరణవార్త తెలుసుకున్న తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమకు ఒక నటిగా ఆమె అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ నివాళులర్పించింది. అంతేకాకుండా, ఈ కష్టసమయంలో ఆమె కుటుంబానికి అండగా నిలిచేందుకు దర్శకుల సంఘం ముందుకు వచ్చింది. దర్శకుల సంఘం ట్రస్ట్ తరఫున రూ. 50,000, అలాగే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు తరఫున రూ. 50,000 కలిపి మొత్తం లక్ష రూపాయలు విరాళాన్ని నటి కుటుంబానికి అందజేస్తున్నట్లు దర్శకుల సంఘం ప్రకటించింది.

గుంటూరు జిల్లా అమరావతిలో 1951లో జన్మించిన నేతి శ్యామల, నాటకరంగంలో ప్రదర్శించిన 'పావలా' అనే ప్రసిద్ధ నాటకంతో 'పావలా శ్యామల'గా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి.. 'బాబాయ్ అబ్బాయ్', 'ఖడ్గం', 'వర్షం', 'ఆంధ్రావాలా', 'గోలీమార్', 'మత్తు వదలరా' వంటి ఎన్నో చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించారు.

 

 

Pavala Shyamala, Pavala Syamala, Directors Association, K Raghavendra Rao

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.