![]() |
![]() |

కోలీవుడ్‌లో స్టార్ హీరో ధనుష్, విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. 'పొల్లాదవన్', 'ఆడుగళం', 'వడ చెన్నై', 'అసురన్' వంటి క్లాసిక్ హిట్ల తర్వాత వీరిద్దరూ మరోసారి చేతులు కలుపుతున్నారు. చాలా కాలంగా 'వడ చెన్నై-2' కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ.. ఈ క్రేజీ కాంబినేషన్ లో సరికొత్త సినిమాను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి 'తమిళ్ మురుగన్' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. మురుగన్ (సుబ్రహ్మణ్య స్వామి) నేపథ్యంతో ఈ కథ నడవనుందని తెలుస్తోంది. అయితే ఈ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ఎందుకంటే, ఇటీవలే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో కూడా మురుగన్ కాన్సెప్ట్‌తోనే ఒక భారీ చిత్రం అనౌన్స్ అయింది.
ఒకే దేవుడి కాన్సెప్ట్, ఒకే తరహా నేపథ్యంతో సౌత్ ఇండియాలో ఇద్దరు అగ్ర హీరోలు సినిమాలు చేస్తుండటంతో సహజంగానే సినీ ప్రియుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జూన్ 29న ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించింది. ముఖ్యంగా "ఉత్తరాదిన జన్మించాడు.. దక్షిణాదిన పూజలు అందుకుంటున్నాడు." అంటూ నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ దుమారం రేపింది. మురుగన్(కుమారస్వామి) ఉత్తరాదిన జన్మించాడు అనడాన్ని తమిళులు వ్యతిరేకించారు. సినిమాని అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. ఇక ఇప్పుడు ధనుష్, వెట్రిమారన్ ఏకంగా మురుగన్ కథతో సినిమా చేయడానికి రంగంలోకి దిగడం సంచలనంగా మారింది.
తమిళులకు మురుగన్ దేవుడిపై అపారమైన భక్తి, సెంటిమెంట్ ఉంటాయి. తెలుగు వారితో పోలిస్తే తమిళ సంస్కృతిలో మురుగన్ ఆరాధన చాలా ఎక్కువ. అందువల్ల వెట్రిమారన్ ఈ కథను మరింత నేటివిటీతో, అథెంటిక్‌గా (నమ్మశక్యంగా) తెరకెక్కించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ధనుష్-వెట్రిమారన్ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో మాత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. హడావుడిగా క్రియేట్ చేసినట్లు ఉన్న ఈ వీడియోలో ఎక్కువగా ఏఐ టెక్నాలజీని వాడటం, క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో సోషల్ మీడియాలో కాస్త నెగిటివ్ కామెంట్లు వస్తున్నాయి. అయినప్పటికీ వెట్రిమారన్ మార్క్ స్క్రీన్ ప్లేపై అందరికీ నమ్మకం ఉంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, ధనుష్ - వెట్రిమారన్ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
ప్రస్తుతానికి త్రివిక్రమ్ సినిమా పురాణ నవల ఆధారంగా సాగుతుందని క్లారిటీ ఉన్నా, వెట్రిమారన్ చిత్రం పీరియడ్ డ్రామానా లేక సోషియో ఫాంటసీనా అనేదానిపై స్పష్టత లేదు. తమిళ నేటివిటీ కలిగిన మురుగన్ సబ్జెక్ట్‌ను వెట్రిమారన్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు భారీ చిత్రాలు ఒకే సమయంలో విడుదలైతే బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ తప్పదు. మరి ఈ ఇద్దరు దిగ్గజ దర్శకులు ఒకే తరహా కాన్సెప్ట్‌ను తమతమ స్క్రీన్లపై ఎలా ఆవిష్కరిస్తారో, ఈ మురుగన్ వార్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
https://x.com/wunderbarfilms/status/2075611950265029031
Jr NTR, God Of War, Dhanush, Thamizh Murugan, TeluguOne
![]() |
![]() |