![]() |
![]() |

స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందిన శ్రీలీల(Sreleela)ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబైలోని వర్లీలో గల ఎస్‌వీపీ స్టేడియంలో 'దివ్యాజ్ ఫౌండేషన్' నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖులతో పాటు శ్రీలీల కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది 'హెల్తీ ఏజింగ్ కోసం యోగా' అనే థీమ్‌తో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో సుమారు 1000 మందికి పైగా అనాథ పిల్లలు, అమరవీరులైన రైతుల పిల్లలు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు.
కార్యక్రమంలో భాగంగా శ్రీలీల స్వయంగా యోగాసనాలు వేసి, ప్రస్తుత వేగవంతమైన మరియు ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ప్రాధాన్యతను వివరించింది. ఆందోళన (యాంగ్జైటీ), మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో 100 శాతం యోగాను ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. శ్రీలీల ప్రసంగం, ఆమె ఫిట్‌నెస్ మంత్రం అక్కడ ఉన్న వేలాది మందిని విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫోటో సెషన్‌లో జరిగిన ఒక ఊహించని పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి, సామాజిక కార్యకర్త అమృతా ఫడ్నవీస్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోల కోసం అందరూ ఒకే చోట నిలబడిన సమయంలో, అమృతా ఫడ్నవీస్ తన చేతి వేళ్లతో సైగ చేస్తూ శ్రీలీలను పక్కకు తప్పుకోవాలని చెప్పినట్టుగా ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక టాలీవుడ్ అగ్ర కథానాయిక పట్ల అలా వేళ్లతో సైగ చేస్తూ పక్కకు వెళ్లమనడం సరైన పద్ధతి కాదని, ఇది శ్రీలీలని ఘోరంగా అవమానించడమేనని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Also read: samantha: నా బిడ్డే నా ప్రపంచం.. తేల్చిపడేసిన సమంత
మరోవైపు, ఈ వివాదంపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది కేవలం ఫోటో సెషన్‌లో కెమెరా యాంగిల్ కోసం జరిగిన సాధారణ సంఘటన మాత్రమేనని, కొందరు కావాలనే దానిని పెద్ద వివాదంగా మారుస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. గ్రూప్ ఫోటోలో అందరూ సరిగ్గా కనిపించాలనే ఉద్దేశంతోనే అలా సర్దుబాటు చేయమన్నారే తప్ప, అందులో ఎలాంటి అవమానకర ఉద్దేశం లేదని మరికొందరు సమర్థిస్తున్నారు. అయితే ఈ సున్నితమైన అంశంపై అటు నటి శ్రీలీల కానీ, ఇటు అమృతా ఫడ్నవీస్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

![]() |
![]() |