![]() |
![]() |

స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన పవర్‌ప్యాక్డ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేస్తూ, అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి వీకెండ్‌లోనే ఊహించని రీతిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఒక సాధారణ చీరకట్టు గృహిణి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయుధం పట్టి వీరనారిగా ఎలా మారిందనే ఆసక్తికరమైన కథాంశంతో రూపకల్పన చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి భారీ సంఖ్యలో తరలివస్తూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతున్నారు.
కలెక్షన్ల విషయానికి వస్తే, 'మా ఇంటి బంగారం' మొదటి రోజు నుంచే తన ఉనికిని బలంగా చాటుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 2,658 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం, మొదటి రోజు ఇండియాలో రూ. 5.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రూ. 12.80 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండవ రోజైన శనివారం నాటికి ఈ చిత్రం ఏకంగా 40.2 శాతం వృద్ధిని కనబరిచి, రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీనితో కేవలం రెండు రోజుల్లోనే భారతదేశంలో రూ. 12.85 కోట్ల నెట్, అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 25.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, సౌత్ ఇండియాలోనే ఒక సోలో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి లభించిన రెండవ అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్‌గా రికార్డు సృష్టించింది. గతంలో అనుష్క శెట్టి నటించిన 'భాగమతి' (రూ. 24.50 కోట్లు), 'రుద్రమదేవి' (రూ. 22 కోట్లు) చిత్రాల రెండు రోజుల రికార్డులను సమంత బ్రేక్ చేయడం విశేషం.
ఇక మూడవ రోజైన ఆదివారం నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత రౌద్రరూపం దాల్చింది. ఆదివారం వసూళ్లలో దాదాపు 30 శాతం అద్భుతమైన గ్రోత్ కనిపిస్తూ, సింగిల్ డేలోనే రూ. 10.10 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టింది. దీనితో కేవలం మూడు రోజుల్లోనే అంటే మొదటి వీకెండ్ ముగిసే సమయానికి భారతదేశంలోనే రూ. 26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సామ్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం లాంచ్ అయిన మొదటి రోజు నుంచే భారీ రెస్పాన్స్ అందుకుని, మూడు రోజుల్లో 1.25 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15.10 కోట్లు) మార్కును దాటేసింది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ. 41 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది.
ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సమంత నటన, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గుల్షన్ దేవయ్య విలనిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. థియేట్రికల్ ఓపెనింగ్స్ కేవలం హీరోల చిత్రాలకే వస్తాయనే అపోహను చెరిపేస్తూ, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఈ స్థాయి వసూళ్లను సాధించడం సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప పరిణామంగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
![]() |
![]() |