![]() |
![]() |
మన టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో, మాలీవుడ్ (మలయాళ చిత్రసీమ)లో 'ఓనమ్' పండుగ సీజన్‌కు అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈ స్పెషల్ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి అక్కడి స్టార్ హీరోలు ఎప్పుడూ తెగ పోటీ పడుతుంటారు. అయితే రాబోయే ఓనమ్ పండుగ విండో మాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ మరియు రసవత్తరమైన బాక్సాఫీస్ పోరాటానికి వేదిక కాబోతోంది. మలయాళ పరిశ్రమకు చెందిన ముగ్గురు టాప్ స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, నివిన్ పౌలీ ఒకేసారి థియేటర్లలో ఢీకొనడానికి కర్చీఫ్ వేశారు.
మొదటగా, వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖలీఫా'. వైశాఖ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓనమ్ కానుకగా ఆగస్టు 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో మాలీవుడ్ లెజెండ్ మోహన్ లాల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
మరోవైపు టాలీవుడ్, కోలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ మాతృభాషకు కాస్త గ్యాప్ ఇచ్చిన డీక్యూ (దుల్కర్ సల్మాన్) ఈసారి ఓనమ్ రేసులో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. 'కింగ్ ఆఫ్ కోత' తర్వాత ఆయన మలయాళంలో నటిస్తున్న తాజా చిత్రం 'ఐయామ్ గేమ్'. 'ఆర్డీఎక్స్' లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీస్ట్ అండ్ గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కూడా సరిగ్గా ఆగస్టు 20నే థియేటర్లలోకి రానుంది. గత ఏడాది ప్రొడ్యూసర్‌గా సక్సెస్ చూసిన దుల్కర్, ఈ పండుగకు హీరోగా గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఇక ఈ ఇద్దరు స్టార్లతో పాటు బాక్సాఫీస్ రేసులోకి సైలెంట్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు లవర్ బాయ్ నివిన్ పౌలీ. 'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియాను ఊపేసిన డైరెక్టర్ గిరీష్ ఏడీ కాంబినేషన్‌లో నివిన్ పౌలీ, క్రేజీ బ్యూటీ మమితా బైజు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ 'బెత్లెహం కుడుంబ యూనిట్'. ఇప్పటికే మే నెలలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ క్లీన్ ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ను కూడా ఓనమ్ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ ముగ్గురు స్టార్ హీరోలకు కూడా ఈ పండుగ సీజన్ విజయం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం మాలీవుడ్ మార్కెట్ రేంజ్ విపరీతంగా పెరగడంతో సోషల్ మీడియాలో ఈ బిగ్గెస్ట్ క్లాష్‌పై ఇప్పుడే భారీ ఎత్తున చర్చలు, ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. ఆగస్టు 16 నుండి 25 వరకు జరిగే ఈ పండుగ హడావిడిలో థియేటర్ల సర్దుబాటు ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో, ఈ క్రేజీ రేసులో చివరికి ఎవరు నిలుస్తారో, ఎవరు తప్పుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
![]() |
![]() |