Home  »  News  »  గ్లోబల్ మార్కెట్‌పై టాలీవుడ్ కన్ను.. తెలుగు సినిమాల్లోకి హాలీవుడ్ సూపర్ స్టార్స్!

Updated : Jun 18, 2026

తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పుడు సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమైంది. ఒకప్పుడు ప్రాంతీయ భాషా చిత్రాలుగా మాత్రమే ముద్రపడ్డ మన సినిమాలు.. 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి చిత్రాలు భారతీయ సినిమా సరిహద్దులను ఎప్పుడో బద్దలు కొట్టాయి. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర దర్శకులు, అగ్ర నిర్మాతలలో సరికొత్త ఆలోచనలు మొదలయ్యాయి. వారి చూపు కేవలం మన దేశ మార్కెట్ మీదే కాదు, టోటల్ గ్లోబల్ మార్కెట్‌ను కొల్లగొట్టడంపై పడింది. అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను సైతం మన థియేటర్ల వైపు ఆకర్షించడం కోసం సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే హాలీవుడ్ మరియు కొరియన్ సూపర్ స్టార్స్‌ను మన సినిమాల్లో విలన్లుగా రంగంలోకి దించుతున్నారు. అసాధారణమైన భారీ బడ్జెట్‌లతో రూపుదిద్దుకుంటున్న తెలుగు సినిమాలు ఇప్పుడు 'పాన్ వరల్డ్' స్థాయి చిత్రాలుగా ప్రపంచాన్ని ఊపేయడానికి సిద్ధమవుతున్నాయి.

టాలీవుడ్‌లో ఈ సరికొత్త ట్రెండ్ దర్శకులకు దిక్సూచిగా నిలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంతోనే ఊపుందుకుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆ సినిమాలో రే స్టీవెన్సన్, ఒలీవియా మోరిస్ వంటి హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. ఆ సినిమా సాధించిన ఘనమైన అంతర్జాతీయ విజయంతో పాటు ఏకంగా ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం వంటి సంచలనాలు హాలీవుడ్ మేకర్స్ మరియు నటీనటుల దృష్టిని టాలీవుడ్ వైపు గట్టిగా తిప్పేలా చేశాయి. అప్పటినుంచి టాలీవుడ్ లోని ప్రతి క్రేజీ ప్రాజెక్ట్ లో ఇంటర్నేషనల్ స్టార్స్ భాగమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి' (Ranabaali) కూడా ఇదే బాటలో సాగుతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చారిత్రక చిత్రంలో హాలీవుడ్ క్లాసిక్ సిరీస్ 'ది మమ్మీ' లో 'ఇమ్హోటెప్' పాత్రతో గ్లోబల్ ఆడియన్స్‌ను భయపెట్టిన హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ విలన్‌గా నటిస్తున్నారు. ఆయన ఇందులో 'సర్ థియోడర్ హెక్టర్' అనే క్రూరమైన విలన్ పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు అంతర్జాతీయ స్థాయికి పెరిగిపోయాయి. 

మరోవైపు, రెబల్ స్టార్ ప్రభాస్, 'యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా 'స్పిరిట్' (Spirit)లో సైతం ఒక భారీ అంతర్జాతీయ నటుడి పేరు గట్టిగా వినబడుతోంది. హాలీవుడ్ మార్వెల్ చిత్రం 'ఎటర్నల్స్'తో పాటు 'ట్రైన్ టు బుసాన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 55 ఏళ్ల కొరియన్ యాక్షన్ స్టార్ డాన్ లీ, ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా తలపడనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

అన్నిటికంటే ముఖ్యంగా, దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' (Varanasi) హాలీవుడ్ రేంజ్‌ను మించిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టాప్ స్టార్స్‌లో ఒకరైన క్రిస్ హేమ్స్‌వర్త్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మనందరికీ 'థోర్' గా సుపరిచితుడైన ఈ 41 ఏళ్ల ఆస్ట్రేలియన్ స్టార్, వారణాసి చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ పాత్రలో నటించబోతున్నారనే వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 

వీటికి తోడు అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా' (Raaka) లోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండేలా హాలీవుడ్ యాక్టర్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇలా హాలీవుడ్ నటీనటులు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు తెలుగు సినిమాల్లో భాగమవ్వడంతో సహజంగానే నిర్మాణ వ్యయం ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకుతోంది. వందల కోట్ల నుంచి వేల కోట్ల బడ్జెట్లతో మన సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, హాలీవుడ్ స్టార్స్ తోడుకావడంతో ఈ సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా క్రేజీ బిజినెస్ జరుగుతోంది. అమెరికా, యూరప్‌లతో పాటు జపాన్, కొరియా, చైనా వంటి దేశాల్లో కూడా మన సినిమాలు నేరుగా భారీ ఎత్తున విడుదలవుతూ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతున్నాయి. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.