![]() |
![]() |

టాలీవుడ్‌లో సరికొత్త కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన టాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల (Sreenu Vaitla), విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న చామింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) కాంబినేషన్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఆనందం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దూకుడు, బాద్‍షా వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఇండస్ట్రీకి అందించిన ఘనత శ్రీను వైట్లది. ఇప్పుడు చాలా కాలం తర్వాత శర్వానంద్‌తో కలిసి ఆయన సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. ఈ భారీ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించిన కార్యాలయ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు నేడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగాయి. ఈ ప్రత్యేక పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఫొటోలో డైరెక్టర్ శ్రీను వైట్ల దేవుడి పటాలకు హారతి ఇస్తూ కనిపించగా, పక్కనే పూజారి మంత్రోచ్ఛారణలు చేస్తున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
శ్రీనువైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు శర్వానంద్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఏంటంటే, ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
టాలీవుడ్‌లో సంక్రాంతి సీజన్ అనేది వసూళ్ల పరంగా మరియు థియేటర్ల పరంగా ఎంతో కీలకం. పైగా ఈ జనరేషన్ లో సంక్రాంతి హీరోగా శర్వానంద్ కి పేరుంది. ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానంభవతితో పాటు ఈ ఏడాది విడుదలైన 'నారీ నారీ నడుమ మురారి'తో సంక్రాంతి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి సంక్రాంతి రేసులో నిలవడం ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కోసం శ్రీను వైట్ల ఒక అద్భుతమైన హిలేరియస్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేశారని సమాచారం. శర్వానంద్ ఇప్పటివరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు, కానీ శ్రీను వైట్ల లీడ్ క్యారెక్టరైజేషన్ ఎంతో విభిన్నంగా ఉంటుంది. గతంలో వెంకీ, దూకుడు చిత్రాలలో హీరోల కామెడీ టైమింగ్ ఏ రేంజ్‌లో ఉందో మనందరికీ తెలిసిందే. అదే తరహాలో శర్వానంద్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారు. ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లనుంది. పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి, సంక్రాంతి పండుగ నాటికి ప్రేక్షకులను థియేటర్లలో నవ్వించడానికి సిద్ధమవుతోంది.
![]() |
![]() |