![]() |
![]() |
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులకు, ముఖ్యంగా భారతీయ హాలీవుడ్ అభిమానులకు ఇది ఒక మైండ్ బ్లోయింగ్ న్యూస్! 'ఇన్సెప్షన్', 'ఇంటర్స్టెల్లార్', 'ది డార్క్ నైట్', 'ఒపెన్‌హైమర్' వంటి విజువల్ వండర్స్ అండ్ మైండ్ బెండింగ్ చిత్రాలతో గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా అధికారిక పర్యటనపై భారతదేశంలో అడుగుపెట్టబోతున్నారు. తన రాబోయే భారీ క్రేజీ ప్రాజెక్ట్ 'ది ఒడిస్సీ' (The Odyssey) చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ముంబై నగరానికి రానున్నారు.
యూనివర్సల్ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. జులై నెలలో ముంబైలో జరగబోయే ఈ చిత్ర గ్రాండ్ గ్లోబల్ ప్రీమియర్ వేడుకకు దర్శకుడు నోలన్‌తో పాటు హాలీవుడ్ టాప్ స్టార్స్, ఆస్కార్ విజేత మ్యాట్ డామన్, స్పైడర్‌మ్యాన్ ఫేమ్ టామ్ హాలండ్ మరియు ఆస్కార్ అవార్డు గ్రహీత, నిర్మాత ఎమ్మా థామస్ కూడా హాజరుకానున్నారు. నోలన్ కెరీర్లోనే ఒక సినిమా కోసం ఇలా భారతదేశంలో భారీ ప్రీమియర్ ఈవెంట్ నిర్వహించడం ఇదే ప్రథమం కావడంతో సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా లండన్, పారిస్, న్యూయార్క్ వంటి ప్రఖ్యాత నగరాల జాబితాలో ముంబైని కూడా గ్లోబల్ ప్రీమియర్ టూర్ కోసం సెలెక్ట్ చేయడం చూస్తుంటే.. హాలీవుడ్ మేకర్స్ భారతీయ సినిమా మార్కెట్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో స్పష్టమవుతోంది. హోమర్ రచించిన చారిత్రాత్మక ఇతిహాసం 'ఒడిస్సీ' కథ ఆధారంగా ఈ సినిమాను నోలన్ తనదైన శైలిలో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో తెరకెక్కించారు. ట్రాయ్ పతనం అనంతరం కథానాయకుడు ఒడిస్సియస్ తన స్వగృహానికి చేరుకోవడానికి చేసిన పదేళ్ల సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం.
ఈ సినిమా సాంకేతికంగా మరో సరికొత్త మైలురాయిని సృష్టించబోతోంది. సరికొత్త సరివిప్లవాత్మక ఐమ్యాక్స్ (IMAX) ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించి, హాలీవుడ్ చరిత్రలోనే పూర్తి సినిమాను కేవలం ఐమ్యాక్స్ కెమెరాలతోనే షూట్ చేసిన మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్‌గా 'ది ఒడిస్సీ' రికార్డు సృష్టించింది. ముంబై ఫీనిక్స్ పల్లాడియంలోని ప్రతిష్టాత్మక పీవీఆర్ ఐకాన్ ఐమ్యాక్స్ థియేటర్ ఈ అద్భుత ఘట్టానికి వేదిక కానుంది.
ఈ భారీ విజువల్ ఎపిక్‌లో మ్యాట్ డామన్, టామ్ హాలండ్‌లతో పాటు ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా యోంగో, జెండాయా, మరియు చార్లీజ్ థెరాన్ వంటి హాలీవుడ్ అగ్ర తారాగణం భాగమైంది. నోలన్ సొంత బ్యానర్ సింకోపీపై ఎమ్మా థామస్‌తో కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ ప్రీమియర్ ఈవెంట్‌పై ఇండియన్ ఫ్యాన్స్ విపరీతమైన హంగామా చేస్తున్నారు. భారత గడ్డపై జరగబోయే అతిపెద్ద అంతర్జాతీయ సినీ ఈవెంట్‌గా ఇది నిలిచిపోనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ విజువల్ వండర్ జులై 17న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మన దేశంలోని ప్రముఖ నగరాల్లోని ఐమ్యాక్స్ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలై సంచలనం సృష్టిస్తున్నాయి. నోలన్ మార్క్ విజువల్స్ మరియు టామ్ హాలండ్-మ్యాట్ డామన్‌ల స్క్రీన్ ప్రెజెన్స్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
![]() |
![]() |