![]() |
![]() |
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బన్నీ, ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, ఆయన తదుపరి చిత్రం ‘రాకా’కు సంబంధించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా నిర్మాణ సంస్థ తీసుకున్న ఒక నిర్ణయం అల్లు అర్జున్ అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, 'రాకా' చిత్రంలో అల్లు అర్జున్ చేసే మేనరిజమ్స్, డైలాగ్స్ మరియు సిగ్నేచర్ యాక్ట్స్‌పై నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కాపీరైట్ హక్కులను పొందాలని భావిస్తోందట. అంటే, ఈ సినిమాలో బన్నీ చేసే కొత్త స్టెప్పులను కానీ, డైలాగులను కానీ బయట ఎవరూ అనుకరించకూడదని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా సెలబ్రిటీల ముఖాలను, వాయిస్‌ను ఏఐ (AI) ద్వారా తప్పుగా వాడకుండా ఉండటానికి కోర్టు ఆర్డర్లు తెచ్చుకోవడం చూశాం, కానీ ఇలా సిగ్నేచర్ మూవ్స్‌పై ఆంక్షలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా ప్రమోషన్లకు సోషల్ మీడియా రీల్స్, షార్ట్స్ ఎంతో దోహదపడతాయి. గతంలో 'పుష్ప' చిత్రంలోని 'తగ్గేదే లే' మేనరిజం, శ్రీవల్లి సాంగ్ స్టెప్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. విదేశీ క్రికెటర్ల నుంచి సామాన్యుల వరకు అందరూ వాటిని అనుకరించడం వల్ల సినిమాకు విపరీతమైన పబ్లిసిటీ లభించింది. బన్నీ గ్లోబల్ స్టార్ కావడానికి ఆ మేనరిజమ్స్ కూడా ఒక ప్రధాన కారణం.
అలాంటిది ఇప్పుడు ‘రాకా’ సినిమాలో అల్లు అర్జున్ చేసే స్టైల్స్‌ను ఎవరూ కాపీ చేయకూడదని రూల్ పెట్టడం వల్ల సినిమా పబ్లిసిటీకే దెబ్బ తగిలే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో మేకర్స్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. మా హీరో స్టైల్స్‌ను మేము ఫాలో అవ్వకపోతే ఎలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.మరి ఈ కాపీరైట్ వివాదంపై అల్లు అర్జున్ స్వయంగా స్పందిస్తారా లేదా సన్ పిక్చర్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.
ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏది ఏమైనా, ఐకాన్ స్టార్ సినిమా అంటే ఆ మేనరిజమ్స్ చూసి ఫ్యాన్స్ చేసే హడావుడే వేరు, దాన్ని అడ్డుకుంటే మాత్రం ఫ్యాన్స్ ఊరుకునేలా లేరు.
![]() |
![]() |