Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈ రోజు హెడ్ లైన్స్...

Updated : May 15, 2026

1. 'వీరభద్రుడు' మూవీ రివ్యూ
సూర్య హీరోగా నటించిన 'కరుప్పు' మూవీ తెలుగులో 'వీరభద్రుడు' పేరుతో విడుదలైంది. ఫస్ట్ హాఫ్ కోర్టు డ్రామా, ఎమోషనల్ సీన్స్‌తో ఆసక్తికరంగా సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్ కథనం గాడి తప్పింది. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వెళ్లేకొద్దీ యాక్షన్ మోడ్ మితిమీరిపోయి కథలోని సహజత్వాన్ని దెబ్బతీసింది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దానిని తెరపై ఆవిష్కరించడంలో తడబడటంతో సినిమా యావరేజ్‌గా మిగిలిపోయింది.

2. పెద్ది సెన్సార్ పూర్తి
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న 'పెద్ది' మూవీ డైలాగ్ సెన్సార్ పూర్తయింది. అన్ని భాషల్లో మెయిన్ సెన్సార్ ఈ వారంలోనే పూర్తి చేయనున్నారు. ముందుగా అనుకున్న రన్ టైంని కూడా కొంత తగ్గిస్తున్నారని తెలుస్తోంది. మూడు గంటల రెండు నిమిషాలకు తీసుకురావాలనే కసరత్తు జరుగుతోందని సమాచారం.

3. ఎన్టీఆర్- ‘డ్రాగన్’.. ఇంటర్నేషనల్ రేంజ్ యాక్షన్!
జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న భారీ చిత్రం 'డ్రాగన్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా తదుపరి హైదరాబాద్‌ షెడ్యూల్ కోసం విదేశీ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దించుతున్నారు. ఇంటర్నేషనల్ ఫైటర్లతో భారీ ఫైట్స్ ప్లాన్ చేశారట. కేజీఎఫ్, సలార్ సినిమాలను మించేలా ఈ ఫైట్స్ ఉంటాయని టాక్.
 
4. దర్శకుడిగా రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన పుట్టినరోజు సందర్భంగా ఆయన 23వ సినిమా ప్రకటన వచ్చింది. దీనికి ఆయనే కథను అందిస్తూ, దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. 'వీర' అనే పవర్ ఫుల్ పాత్రలో రామ్ కనిపించనున్న ఈ సినిమాను.. ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

5. పర్సంటేజీ విధానం పరిష్కరణకు కమిటీ ఏర్పాటు!
థియేటర్ల పర్సంటేజీ విధానంపై నెలకొన్న వివాదానికి పరిష్కారం కనుగొనేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వచ్చే రెండు నెలల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశాలు జారీ చేశారు.

6. 'పెద్ది' రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!
నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. 'పెద్ది' సినిమా విడుదల విషయంలో ఇబ్బందులు తప్పవని రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ.. పెద్ది సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. "పెద్ది సినిమా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా రిలీజ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి సందేహాలు అవసరం లేదు" అని దిల్ రాజు అన్నారు.

7. ముంబై వెళ్తున్న ఎన్టీఆర్..!
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్ర గ్లింప్స్ లాంచ్ కోసం తారక్ ముంబై వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ ఒక భారీ ఈవెంట్‌లో ఈ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, ప్రమోషన్లను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. 

8. బేబీ దర్శకుడితో విజయ్ దేవరకొండ!
టాలీవుడ్‌లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. 'బేబీ' సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న దర్శకుడు సాయి రాజేష్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కోసం ఒక వినూత్నమైన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం విజయ్ 'రణబలి', 'రౌడీ జనార్ధన' సినిమాలతో బిజీగా ఉండగా.. సాయి రాజేష్‌తో చేయబోయే సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

9. 'జైలర్ 2' సెట్‌లో విషాదం!
చెన్నై సమీపంలోని ఆదిత్యారామ్ స్టూడియోలో జరుగుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2' షూటింగ్ సెట్‌లో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం లైటింగ్ పనులు చేస్తున్న సమయంలో కార్తికేయన్ అనే లైట్‌మెన్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్ర గాయాలైన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

10. ఓటీటీలోకి ‘ధురంధర్ 2’
‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ధురంధర్ 2’ ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది. జూన్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ 'జియో హాట్‌స్టార్'లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జూన్ 4న రాత్రి 7 గంటలకు గ్రాండ్ డిజిటల్ ప్రీమియర్ జరుపుకోనుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.