Home  »  News  »  Agadha Teaser: వెన్నులో వణుకు పుట్టించేలా ఎం.ఎస్. రాజు 'అగధ' టీజర్!

Updated : May 7, 2026

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎం.ఎస్. రాజు మళ్ళీ ఒక ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడిగా ఈసారి 'అగాధ' (Agadha) అనే హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ ద్వారా మనల్ని భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను పొందుతోంది.

టీజర్ ప్రారంభం నుండే ఒక విధమైన చీకటి, భయానక వాతావరణాన్ని సృష్టించడంలో దర్శకుడు విజయం సాధించారు. "ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి" అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో 'అగధ' టీజర్ మొదలవుతుంది. క్షుద్ర పూజలు, అడవిలో వింత సంఘటనలు, నిగూఢమైన రహస్యాల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

మొత్తం టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు. ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా, అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది. 

ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు, మధ్య మధ్యలో ఆసక్తి రేకెత్తించే  డైలాగ్స్.. ప్రతిదీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

"ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా" అని అడిగితే, ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ "అగ్... అగ్... అగధ" అని చెప్పడంతో 'అగధ' అంటే ఎవరు అనే ఆసక్తి కలుగుతుంది. "అగధ వచ్చేసిందమ్మా. 'అగధ' ముందు ఎవ్వరి ఆటలు సాగవు. రా... అగధా… రా" అంటూ వినిపించే డైలాగ్స్ తో టీజర్ తాలూకు ఉత్కంఠ పీక్ లెవెల్ కి చేరినట్టుగా అనిపిస్తుంది. 

కామాక్షి భాస్కర్ల తన నటనతో, గంభీరమైన ముఖ కవళికలతో టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. టీజర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్ చివరిలో కనిపించే ఉద్వేగభరితమైన సీన్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

టోటల్ గా  టీజర్ చూస్తే 'దేవి', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే' వంటి బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఎమ్మెస్ రాజు స్టాండర్డ్స్ ని మించి ఈ విజువల్స్ ఉన్నాయా అనిపిస్తుంది.  'అగధ'ను ఆయన డైరెక్ట్ చేసిన తీరుకి, ఆ విజువల్ ట్రీట్ కి ఒక్కసారిగా థ్రిల్ అవుతాం. ఈ సినిమా ఏ లెవెల్ లో ఉండబోతుందో చెప్పడానికి ఈ టీజర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. 

ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. 

మొత్తానికి 'అగాధ' మూవీ పక్కా హర్రర్ థ్రిల్లర్ ప్రియుల కోసం రూపొందిస్తున్నట్లు అనిపిస్తుంది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.