Home  »  News  »  మంగ్లీ వివాదంపై నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు.. బ్యాన్ చేయడం సాధ్యమేనా? 

Updated : Apr 22, 2026

- క్లారిటీ ఇచ్చిన నట్టి కుమార్

- పోలీసులు తప్పు చేస్తున్నారు 

- గిరిజన బిడ్డలను మోసం చేస్తే ఊరుకోం 

ప్రముఖ జానపద గాయని మంగ్లీ చుట్టూ అల్లుకున్న తాజా వివాదం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. మైక్రో ఫైనాన్స్ కుంభకోణం ఆరోపణలు, పోలీస్ స్టేషన్‌లో జరిగిన హైడ్రామాపై ఆయన తనదైన శైలిలో విశ్లేషించారు. ముఖ్యంగా మంగ్లీ తనను నమ్ముకున్న గిరిజన బిడ్డలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తుచేశారు.

ఈ ఇష్యూపై ‘మా’ (MAA) అసోసియేషన్ వరకు వెళ్లిన ఫిర్యాదుల గురించి ప్రస్తావిస్తూ.. కోర్టు తీర్పు రాకముందే ఎవరినీ బ్యాన్ చేసే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అయితే, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఆమెను కార్యక్రమాలకు పిలవద్దని వస్తున్న విజ్ఞప్తులపై మాట్లాడుతూ.. ఇది కేవలం ఆరోపణల దశలో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఒకవేళ తప్పు జరిగినట్లు రుజువైతేనే అసోసియేషన్ తరపున చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

మంగ్లీ కూడా ఒక గిరిజన బిడ్డ అని, తన సొంత సామాజిక వర్గానికి చెందిన పేద ప్రజలు మోసపోయినప్పుడు ఆమె మౌనంగా ఉండకూడదని నట్టి కుమార్ హితవు పలికారు. "కళామతల్లి ఆశీస్సులతో ఈరోజు ఆమె గొప్ప స్థాయికి చేరింది. కాబట్టి, మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా, వారి డబ్బు వారికి తిరిగి వచ్చేలా ఆమె కృషి చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

పోలీసుల తీరుపై కూడా నట్టి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను ఎండలో నిలబెట్టి, సెలబ్రిటీలకు కుర్చీలు వేసి గౌరవించడం ఏంటని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌పై ప్రజలకు నమ్మకం పోకూడదని, తెలంగాణ పోలీస్ అంటే 'ఫ్రెండ్లీ పోలీసింగ్' అని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో, బాధితులకు న్యాయం జరగకపోతే పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.