![]() |
![]() |

భారతీయ సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన సినిమా 'బాహుబలి'. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) సృష్టించిన ఈ దృశ్య కావ్యం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. ఇప్పుడు అదే 'బాహుబలి' ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేషన్ ఫిల్మ్ 'బాహుబలి: ద ఎటర్నల్ వార్' (Baahubali: The Eternal War) సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది.
అంతర్జాతీయ యానిమేషన్ ఫెస్టివల్‌కు ఎంపిక
ఫ్రాన్స్‌లో జరగనున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఎన్నేసి ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్ 2026' (Annecy International Animation Festival 2026) లో ప్రదర్శనకు 'బాహుబలి: ద ఎటర్నల్ వార్' అధికారికంగా ఎంపికైంది. ఇందులో 'వర్క్ ఇన్ ప్రోగ్రెస్' విభాగంలో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. యానిమేషన్ రంగంలో ఈ ఫెస్టివల్‌ను 'యానిమేషన్ ప్రపంచపు కేన్స్ ఫెస్టివల్'గా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి వచ్చే అత్యుత్తమ యానిమేషన్ చిత్రాల మధ్య భారతీయ చిత్రం చోటు సంపాదించుకోవడం గర్వకారణం.
రాజమౌళి ఆనందం
ఈ అరుదైన గౌరవంపై దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "యానిమేషన్ అనేది హద్దులు లేని అద్భుతమైన ప్రపంచమనే విషయాన్ని నేను ఎప్పుడూ నమ్ముతాను. మన భారతీయ సినిమాకు దక్కిన ఒక అరుదైన గౌరవంగా దీన్ని భావిస్తున్నా. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై మా సినిమాను ప్రదర్శించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా భారతీయ యానిమేషన్ టెక్నాలజీని, కథా బలాన్ని ప్రపంచ సినీ దిగ్గజాలకు చూపే అవకాశం లభించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
https://x.com/ssrajamouli/status/2044296607529873473
భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికత
'బాహుబలి: ద ఎటర్నల్ వార్' సినిమాను సుమారు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత మాహిష్మతి సామ్రాజ్యంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కథ సాగనుంది. 'ఆర్కా మీడియా వర్క్స్' నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు ఇషాన్ శుక్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కేవలం యానిమేషన్ సినిమాగానే కాకుండా, బాహుబలి ప్రపంచాన్ని మరింత లోతుగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే విజువల్ వండర్ గా బాహుబలి సిరీస్ మన దేశంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు యానిమేషన్ విభాగంలో కూడా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో 'జై మాహిష్మతి' అనే నినాదాలు మరోసారి మారుమోగుతున్నాయి.
![]() |
![]() |