Home  »  News  »  Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ కోసం రాశి ఖన్నా కష్టం.. కొన్నిసార్లు 24 గంటలూ!

Updated : Mar 17, 2026

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఉగాది కానుకగా మార్చి 19న 'ఉస్తాద్ భగత్ సింగ్' థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ రాశి ఖన్నా(Raashii Khanna) పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది. 

ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?
పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే కథ కూడా వినకుండా ఎంతో ఉత్సాహంతో వెంటనే ఓకే చెప్పేశాను. నా కెరీర్ లో కథ వినకుండా ఓకే చేసిన సినిమా ఇదే. నేను నా మొదటి సినిమా చేస్తున్నప్పటి నుంచే, పవన్ కళ్యాణ్ గారి స్టార్డమ్ గురించి, పవనిజం గురించి విన్నాను. అప్పుడే ఆయనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలి అనుకున్నాను. 'ఉస్తాద్ భగత్ సింగ్'తో నా కల నెరవేరింది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
నా పాత్ర పేరు శ్లోక. తను చాలా మోడరన్ అమ్మాయి. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంది. నా పాత్రకు కూడా మంచి క్యారెక్టరైజేషన్ ఉంటుంది. నాకు ఇందులో ఒక మాస్ సాంగ్ ఉంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం కాబట్టి, ఆ సాంగ్ షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను.

పవన్ కళ్యాణ్ గారితో పని చేసిన అనుభవం ఎలా ఉంది?
పవన్ గారు చాలా సింపుల్ పర్సన్, ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. ఆయనలో ఒక తెలియని అమాయకత్వం ఉంది. మీరు నటి కావాలని ముందే అనుకున్నారా? అని మొదటిరోజే నన్ను అడిగారు. లేదు సార్, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని ఆయనతో చెప్పాను. ఆయన తక్కువ మాట్లాడతారు.. కానీ, ప్రతి మాటలో విలువ ఉంటుంది. నాతో ప్రజా సేవ చేయమని చెప్పారు. పవన్ గారు ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు. ఆయన నుంచి మానవత్వం నేర్చుకున్నాను. ఉస్తాద్ వేడుకలో స్టేజ్ మీద నుంచి పవన్ గారి అభిమానులను చూస్తుంటే, ఆయనను ఒక దేవుడిలా ఆరాధిస్తున్నట్లు అనిపించింది.

పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కి తగ్గట్టుగా మీరు డేట్స్ ఇవ్వాలి కదా.. ఏమైనా ఇబ్బంది పడ్డారా?
పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయో చెప్పలేమని హరీష్ గారు ముందే చెప్పారు. అందుకు తగ్గట్టుగా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అని చెప్పాను. కొన్నిసార్లు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటల షిఫ్టులు కూడా పని చేశాను.

దర్శకుడు హరీష్ శంకర్ గారి గురించి?
హరీష్ శంకర్ గారు చాలా స్మార్ట్. ఆయనకు మాస్ పల్స్ బాగా తెలుసు. సాధారణంగా 120 రోజులు పట్టే షూటింగ్‌ను ఆయన కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేశారు. సరిగా నిద్ర కూడా పోకుండా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. హరీష్ గారికి ఓపిక ఎక్కువ. సినిమా పట్ల ఆయన అంకితభావం చూసి చాలా నేర్చుకున్నాను.

'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఎలా ఉండబోతుంది?
'గబ్బర్ సింగ్' లాగే ఈ సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ కలిసి థియేటర్‌లో చూడొచ్చు. ఉగాది పండుగ సమయంలో వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.