![]() |
![]() |
తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్దర్శకులుగా చెప్ప్పుకోదగినవారిలో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఎన్నో విభిన్నమైన సినిమాలు, మరెన్నో ప్రయోగాత్మక చిత్రాలు రూపొందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒక విధంగా సినిమాలు రూపొందించడంలో సింగీతం చేసినన్ని ప్రయోగాలు మరో డైరెక్టర్ చెయ్యలేదు అంటే అతిశయోక్తి కాదు. 94 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ ఒక యువకుడిలా ఆలోచించే ఆయన.. తన మనసులోని భావాలను తెరపై ఆవిష్కరించడంలో ప్రత్యేకతను చూపిస్తారు.
50 ఏళ్ళకు పైగా దర్శకుడుగా ఉన్న సింగీతం శ్రీనివాసరావుతో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. SSR61గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ పర్యవేక్షిస్తారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
సింగీతం శ్రీనివాసరావు నుంచి సినిమా వస్తోందంటే అది ఖచ్చితంగా విభిన్న కథాంశంతో, అంతకు మించిన వైవిధ్యంతో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈసారి ఆయన ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో నందమూరి బాలకష్ణతో చేసిన ఆదిత్య 369 పెద్ద విజయం సాధించడమే కాకుండా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నారని ఎంతోకాలంగా వినిపిస్తున్నమాట.
ఇప్ప్పుడు వైజయంతి మూవీస్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ సింగీతంతో సినిమా చేయబోతోందీ అంటే ఆదిత్య 369కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. పాన్ ఇండియా మూవీస్, భారీ యాక్షన్ సినిమాలు వస్తున్న ప్రస్తుత తరుణంలో సింగీతం శ్రీనివాసరావు వంటి లెజండరీ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తోందీ అంటే అది తప్పకుండా అందరి మనసుల్ని తాకే సినిమా అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగు సినిమా చరిత్రలో క్లాసిక్ చిత్రాలుగా చెప్ప్పుకునే మాయాబజార్ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో సింగీతం శ్రీనివాసరావు పనిచేశారు. సంగీతంలో కూడా ప్రవేశం ఉన్న సింగీతంకి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. అందుకే తన సినిమాల్లోని పాటలన్నీ ఎంతో మధురంగా ఉంటాయి. 1972లో నీతి నిజాయతీ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన సింగీతం.. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకులకు అందించారు. చివరగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా 2013లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టనున్న సింగీతం నుంచి మరో దశ్యకావ్యం వస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న దర్శకుల్లో 94 ఏళ్ళ వయసులోనూ తన 61వ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్న ఏకైక దర్శకుడు సింగీతం.
![]() |
![]() |