![]() |
![]() |

-సిల్వర్ స్క్రీన్ బాధ ఇదే
-ఎన్ని హిట్స్
-ఎన్ని ప్లాప్స్
-హయ్యెస్ట్ కలెక్షన్ ఎంత
ఇంకో రెండో రోజుల్లో 2025 వ సంవత్సరం గతంగా మారబోతుంది. ఈ గతం తమకి ఇచ్చిన తీపి, చేదు గుర్తులని భద్రంగా తమ గుండెల్లో పదిలపరుచుకోవడానికి అందరు కసరత్తులు ప్రారంభించే ఉంటారు. మరి ఆనందాన్ని, ఆయుష్షుని ఇవ్వడం తప్ప మరేం తెలియని సిల్వర్ స్క్రీన్ కూడా తన గతాన్ని గుర్తు చేసుకుని భద్రంగా తన గుండెల్లో భద్ర పరుచుకోవడం ఖాయం. మరి ఆ సిల్వర్ స్క్రీన్ ఏం దాచుకోబోతుందో సిల్వర్ స్క్రీన్ భక్తులుగా ఒకసారి చూద్దాం.
తన ఒడిలోకి వచ్చే అన్ని సినిమాలు ప్రేక్షకులని అలరించి మంచి విజయాన్ని అందుకోవాలనేది సిల్వర్ స్క్రీన్ నైజం. తనకి గుడి కట్టి పూజించే వాళ్ళతో పాటు తనని నమ్ముకున్న వాళ్ళని లాభాల బాట పట్టించాలని కూడా కోరుకుంటుంది. అందులోను బడా సినిమాలు భారీ విజయాన్ని అందుకొని, భారీ కలెక్షన్స్ సాధిస్తే ఎంతగానో సంబరపడుతుంది. కానీ ఈ సారి పెద్ద సినిమాలు ఆ సంబరాన్ని సిల్వర్ స్క్రీన్ కి ఇవ్వలేదు. 2025 ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం, ఓజి మాత్రమే 300 కోట్ల క్లబ్ లో చేరి కాస్తో కూస్తో రక్షణగా ఉన్నాయి.
గేమ్ చేంజర్ 150 కోట్లు రాబట్టినా బడ్జెట్ ఎక్కువ కావడంతో తనని నమ్ముకున్న వాళ్ళు నష్టపోయారనే గిల్టీ ఫీలింగ్ తో సిల్వర్ స్క్రీన్ ఉంది. డాకు మహారాజ్, అఖండ 2 కూడా 150 కోట్ల రూపాయలు రాబట్టినా బడ్జెట్ పరంగా కొంచం సేఫ్. కన్నప్ప, కుబేర, కూలీ సిల్వర్ స్క్రీన్ ని పూర్తిగా సంతోషంలో ఉంచలేకపోయాయి. హరిహర వీరమల్లు కూడా ఆ విషయంలో కాంప్రమైజ్ కాలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో చిన్న చిత్రాలు వచ్చినా సిల్వర్ స్క్రీన్ ని సరైన భరోసా ఇవ్వలేకపోయాయి.
ఆ విషయంలో కోర్టు, లిటిల్ హార్ట్స్ భరోసాని ఇవ్వడమే కాకుండా సిల్వర్ స్క్రీన్ కాలర్ ఎగరేసుకునేలా చేసాయి.ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ మళ్ళీ డల్ నెస్ లోకి వెళ్ళిపోయింది. కానీ బాధలు ఎల్ల కాలం ఉండవనే విధంగా సిల్వర్ స్క్రీన్ కి భవిషత్తుపై నమ్మకం కలిగిస్తు రీసెంట్ గా శంబాల, ఈషా, దండోరా,ఛాంపియన్ వంటి చిత్రాలు రేంజ్ తగ్గట్టుగా వెళుతున్నాయనే సంతోషం సిల్వర్ స్క్రీన్ లో కొట్టొచ్చినట్టు కనపడుతుంది.
తెలుగు సిల్వర్ స్క్రీన్ ఎలాంటి పక్ష పాతం లేకుండా అందర్నీ ఆదరిస్తుందనే విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసి కూడా తమిళ, కన్నడ, తమిళ చిత్రాలు తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ పరువుని నిలబెట్టలేకపోయాయి.కాంతార చాప్టర్ 1 మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మైలురాయిని అందుకొని సిల్వర్ స్క్రీన్ మోముపై నవ్వులని పూయించింది. మేరా భరత్ మహాన్ అంటూ హిందీ చిత్రం దురంధర్ కూడా సిల్వర్ స్క్రీన్ గర్వంతో కాలు పై కాలు వేసుకొని కూర్చునేలా చేసింది. మరి ఇక వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ ఏం చెప్తుందో చూడాలి.
![]() |
![]() |