![]() |
![]() |
తెలుగు సినిమా అనగానే హీరోలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. హీరోయిన్లు కేవలం గ్లామర్‌కి, పాటలకు మాత్రమే పరిమితమై ఉంటారు. అప్పుడప్పుడు వారికి కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ వస్తుంటాయి. ఇటీవలికాలంలో ఆ పరిస్థితి లేదు. కేవలం హీరో చుట్టూ కథ తిరిగే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఈ ఏడాది కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా వచ్చాయి. 2025 టాప్ హీరోయిన్లు సమంత, రష్మిక మందన్న, శ్రీలీల, కీర్తి సురేష్, తమన్నా, రాశిఖన్నా, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేశారు? ఎవరికెన్ని హిట్స్ వచ్చాయి? ఫ్లాపులతో నలిగిపోయిందెవరు అనే విషయాలు తెలుసుకుందాం.
ఒకప్పుడు సమంత టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. విజరు దేవరకొండతో చేసిన ఖుషి చిత్రం ఫ్లాప్ అవ్వడంతో దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్నారు. తన సొంత నిర్మాణంలో చేసిన 'శుభం' చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ప్రస్తుతం నందినిరెడ్డి దర్శకత్వంలో 'మా ఇంటి బంగారం' సినిమా చేస్తోంది. ఈ సినిమాకి కూడా సమంతే నిర్మాత. ఇటీవల రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు సమంత.
రష్మిక మందన్న ఈ సంవత్సరం 5 సినిమాలు చేయడం విశేషం. గత ఏడాది చివరలో వచ్చిన పుష్ప2తో భారీ విజయం ఆమె ఖాతాలోకి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలోనే 'చావా' తో మరో సూపర్‌హిట్ సాధించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌తో చేసిన సికిందర్ నిరాశ పరిచింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో రూపొందిన కుబేర చిత్రంతో మరో హిట్ సాధించింది. ఈ సినిమాలో ఆమె చేసిన క్యారెక్టర్‌కి మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇవి కాక హిందీలో చేసిన థామా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ వెంటనే వచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌తో ఓకే అనిపించుకుంది.
ఇక శ్రీలీల విషయానికి వస్తే.. గత ఏడాది పుష్ప2లో చేసిన కిస్సిక్ సాంగ్‌తో ఫామ్‌లోకి వచ్చింది. ఈ ఏడాది నితిన్‌తో చేసిన రాబిన్ హుడ్, రవితేజతో చేసిన మాస్ జాతర, గాలి కిరీటితో జూనియర్ సినిమాల్లో నటించింది. అయితే వీటిలో ఒక్క సినిమా కూడా శ్రీలీలకు ఉపయోగపడలేదు. దాంతో ఈ సంవత్సరం శ్రీలీల ఫ్లాపులతోనే సర్దుకోవాల్సి వచ్చింది. అనుష్కశెట్టి విషయానికి వస్తే చాలా గ్యాప్ తర్వాత ఘాటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రిష్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా అనుష్కకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. వాస్తవానికి ఈ సినిమాపై ఆమె ఎన్నో హౌప్స్ పెట్టుకున్నారు. తప్పకుండా తనకి ఓ మంచి హిట్ సినిమా అవుతుందనుకున్నారు. కానీ, ఆమె నమ్మకాన్ని వమ్ము చేస్తూ 'ఘాటి' ఫ్లాప్ మూవీగా నిలిచింది. దీంతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు అనుష్క.
ఇటీవలికాలంలో తమన్నా హీరోయిన్గా కంటే ఐటమ్ సాంగ్స్‌లోనే ఎక్కువగా కనిపించింది. అయితే ఈ ఏడాది ఓదెల2లో లేడీ అఘోరాగా నట విశ్వరూపం చూపించే ప్రయత్నం చేసింది. ఆమె పెర్ఫార్మెన్స్కి గొప్ప అప్రిషియేషన్ రాకపోయినా ఫర్వాలేదు అనిపించుకుంది. దీనితోపాటు హిందీలో వెబ్ సిరీస్, సినిమాలతో, ఐటమ్ సాంగ్స్‌తో కొంత వరకు నెగ్గుకు రాగలిగింది.
మరో హీరోయిన్ కీర్తి సురేష్‌కి ఈ ఏడాది అంతగా కలిసి రాలేదు. ఓటీటీలో విడుదలైన ఉప్పు కప్పురంబు ఫర్వాలేదు అనిపించినా రివాల్వర్ రీటా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలా ఈ ఏడాది కీర్తి సురేష్ సాధించింది ఏమీలేదు. ఒక దశలో స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయినా రాశీ ఖన్నా హవా కూడా బాగా తగ్గింది. ఈ ఏడాది చేసిన తెలుసు కదా ఆమెకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. ఇక నిధి అగర్వాల్ ఈ ఏడాది పవన్ కళ్యాణ్‌తో 'హరి హర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ప్రభాస్‌తో నిధి చేసిన రాజా సాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఆ సినిమాతో హిట్ కొట్టి కొత్త సంవత్సరానికి శుభారంభం పలుకుతుందేమో చూడాలి.
![]() |
![]() |