![]() |
![]() |
గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలను పైరసీ చేస్తూ హీరోలకు, దర్శకనిర్మాతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐబొమ్మ రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి రవిని కస్టడీకి తీసుకున్న పోలీసులు కొన్నిరోజులుగా అనేక విషయాల గురించి ప్రశ్నిస్తున్నారు. విచారణకు మొదట సహకరించని రవి ఆ తర్వాత కొన్ని కీలక సమాచారాన్ని పోలీసులకు అందించినట్టు తెలుస్తోంది.
నవంబర్ 27న చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ కార్యాలయానికి రవిని తీసుకొచ్చారు పోలీసులు. మొదటి రోజు అతని నెట్‌వర్క్, ఐపి మాస్కింగ్ టెక్నిక్స్, ఆర్థిక లావాదేవీల వంటి అనేక అంశాలపై విచారణ చేపట్టారు. అంతర్జాతీయ స్థాయిలో రవికి ఉద్యోగులు, ఏజెంట్లు ఉన్నారని పోలీసులు తేల్చారు. గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ద్వారా రవి సంపాదన కోట్లలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. రవిపై 5 కేసుల్ని నమోదు చేశారు. ఒక కేసులో 5 రోజులు, మరో కేసులో 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది.
మొదట్లో పోలీసుల విచారణకు అంతగా సహకరించని రవి.. కస్టడీ ముగుస్తుండడంతో ఎట్టకేలకు నోరు విప్పాడు. తను చేసింది తప్పేనని, దానికి పశ్చాత్తాపపడుతున్నానని చెప్పినట్టు సమాచారం. అతను చెప్పినట్టుగా ప్రచారం జరుగుతున్న ఒక మాట అతని అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ‘నేను బయటికి వెళ్లిన తర్వాత పైరసీ జోలికే వెళ్లను’ అని రవి చెప్పినట్టు తెలుస్తోంది. ‘నాకు విదేశీ పౌరసత్వం ఉన్నందున ఎవరూ నన్ను పట్టుకోలేరనే ధీమా వచ్చింది. గత ఆరు సంవత్సరాలుగా పోలీసులు నన్ను పట్టుకోలేకపోవడంతో నా నెట్‌వర్క్‌ను బాగా విస్తరించగలిగాను’ అని పోలీసుల ఎదుట చెప్పాడని తెలుస్తోంది.
పైరసీ చెయ్యడానికి, రిలీజ్ అయిన రోజే క్వాలిటీ ప్రింట్ బయటకు రావడానికి ఎవరు సహకరిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అందుకే సినీరంగంలోని ప్రముఖులతో అతనికి ఎలాంటి పరిచయాలు ఉన్నాయనే విషయం తెలుసుకోవడానికి, ఈ రాకెట్‌తో సంబంధం ఉన్న ఇతర ముఠాలను గుర్తించడానికి పోలీసులు తమ విచారణను మరింత వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. ఐబొమ్మ రవి పుణ్యమా అని ఇప్పటివరకు కొత్త కొత్త సినిమాలను ఫ్రీగా చూశారు ప్రేక్షకులు. అరెస్ట్ అయిన రోజు నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో అతనికి విపరీతమైన మద్దతు లభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పోలీసుల విచారణలో ‘బయటికి వెళ్లిన తర్వాత పైరసీ జోలికి వెళ్ళను’ అని చెప్పిన రవి మాటలకు అతని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇకపై ఫ్రీగా సినిమాలు చూసే అవకాశం లేదని ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.
![]() |
![]() |