![]() |
![]() |

పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలకు బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇప్పుడు చేతిలో సినిమాలు లేకుండా ఖాళీ అయిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోలెవరూ పూరితో సినిమా చేసేందుకు సిద్ధంగా లేరు. ఈ క్రమంలోనే రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించారు పూరి. అయినా టాలీవుడ్ హీరోలలో స్పందన లేకపోవడంతో విజయ్ దేవరకొండతో లైగర్ చిత్రాన్ని చేసి ఘోరంగా దెబ్బతిన్నారు. ఆ తర్వాత మరోసారి రామ్‌తో ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్‌గా చేసిన డబుల్ ఇస్మార్ట్ డబుల్ డిజాస్టర్ అయిపోయింది. దాంతో ఇక పూరి జగన్నాథ్ కెరీర్ ముగిసిపోయిందని అందరూ భావించారు.
హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఒకేలా తీసుకునే పూరి జగన్నాథ్.. తన రూట్‌ని మార్చారు. ఇప్పటివరకు తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చిన పూరి... ఇప్పుడు తమిళ హీరో విజయ్ సేతుపతితో కలిసి తొలిసారి ఒక సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జెబి మోషన్ పిక్చర్స్ అధినేత జె.బి.నారాయణరావు.. కొండ్రోల్లా కొలాబరేషన్‌లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు పూరి జగన్నాథ్. సెప్టెంబర్ 28న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌తోపాటు టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. పూరి కెరీర్ ప్రారంభం నుంచి చేసిన సినిమాల టైటిల్ ఎంతో చిత్రం, మరెంతో విచిత్రం పెడుతుంటారు. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ డిసైడ్ చేశారో తెలియాలంటే సెప్టెంబర్ 28 వరకు ఆగక తప్పదు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.
![]() |
![]() |