![]() |
![]() |
‘జగన్మాత మూకాంబికా అమ్మవారి ఆశీస్సులతోనే నాకు ప్రతీదీ సాధ్యమైంది తప్ప నేను చేసింది ఏమీ లేదు’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాలపాటు ఏలిన సంగీత చక్రవర్తి, ఇసైజ్ఞాని ఇళయరాజా. ఆయన సంగీతాన్ని ఇష్టపడనివారు, పాడుకోని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. భాషతో సంబంధం లేకుండా శ్రావ్యమైన ఆయన సంగీతాన్ని అందరూ ఆస్వాదిస్తారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించిన ఇళయరాజా.. ఎంతో వినమ్రంగా తాను చేసిందేమీ లేదు అని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. అమ్మవారి ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి వచ్చానని చెబుతున్న ఇళయరాజా ఆ అమ్మవారికి ఓ ఖరీదైన ఆభరణాన్ని తయారు చేయించారు.
కర్ణాటక ఉడిపిలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని కుమారుడు కార్తీక్‌రాజా, మనవడు యతీష్‌తో కలిసి ఇటీవల సందర్శించారు ఇళయరాజా. ఈ సందర్భంగా రూ.4 కోట్ల విలువ గల వజ్రాలు పొదిగిన వెండి కిరీటాన్ని, వీరభద్రస్వామికి వెండి ఆయుధాన్ని బహూకరించారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తీర్థప్రసాదాలతోపాటు అమ్మవారి ఫోటోను బహూకరించారు అర్చకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘సాధారణ భక్తుడిగానే ఇళయరాజా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. 2006లోనూ అమ్మవారికి కిరీటం బహూకరించారు’ అని చెప్పారు.
![]() |
![]() |