![]() |
![]() |

తెలుగునాట ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు టాలీవుడ్ ప్రముఖులు ముందుకొచ్చి తమకు తోచిన ఆర్థిక సహాయం అందిస్తుంటారు. ఈ సంప్రదాయం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా తీవ్రంగా నష్టపోయింది. వరద బాధితులను ఆదుకునేందుకు నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు. తన వంతుగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. (Nandamuri Balakrishna)
విపత్తుల సమయంలో మామూలుగా ఒక హీరో విరాళం ప్రకటించగానే.. ఆ స్ఫూర్తితో మిగతా హీరోలు కూడా ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. కానీ, ఈసారి తెలంగాణ వరద బాధితుల విషయంలో అది జరగలేదు. బాలకృష్ణ బాటలో పయనిస్తూ.. ఇంతవరకు వేరే ఏ హీరో కూడా విరాళం ప్రకటించలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. (Telangana floods)
ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ.. తెలంగాణపై ప్రత్యేక అభిమానం చూపుతుంటారు బాలయ్య. ఇటీవల గద్దర్ అవార్డ్స్ వేడుకలో 'జై తెలంగాణ' నినాదంతో అందరి మనసులను దోచుకున్నారు. ఇప్పుడు తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు.. మిగతా హీరోల కంటే ముందుగా స్పందించి.. మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. దీంతో నెటిజెన్లు, తెలంగాణ ప్రజలు.. బాలకృష్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఇతర హీరోలకు ఏమైందని ప్రశ్నిస్తున్నారు.
తెలుగు సినిమాలకు తెలంగాణ మార్కెట్ కూడా చాలా కీలకం. ఇక్కడి నుంచి తమ సినిమాలకు కోట్లకు కోట్లు కలెక్షన్స్ తెచ్చుకొని.. స్టార్స్ గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. అలాంటిది తమని ఇంతటి వారిన చేసిన ప్రజలు కష్టాల్లో ఉంటే.. ఆదుకోవడానికి హీరోలు ముందుకు రాకపోడంపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బాలయ్యను చూసి నేర్చుకోవాలంటూ హితవు పలుకుతున్నారు.
![]() |
![]() |