![]() |
![]() |

తారాగణం: సత్యరాజ్, వశిష్ఠ ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, సాంచి రాయ్, మేఘన, క్రాంతి కిరణ్, వీటీవీ గణేష్, రాజేంద్రన్ తదితరులు
సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్
డీఓపీ: కుశేందర్ రమేష్ రెడ్డి
ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్
రచన, దర్శకత్వం: మోహన్ శ్రీవత్స
సమర్పణ: మారుతి
బ్యానర్: వానర సెల్యూలాయిడ్
నిర్మాత: విజయ్‌పాల్ రెడ్డి అడిదెల
విడుదల తేదీ: ఆగస్టు 29, 2025
ఇటీవల కాలంలో టైటిల్, ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిన్న చిత్రాలతో త్రిబాణధారి బార్బరిక్ ఒకటి. సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించడం, ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకుడు కావడం కూడా.. ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. స్టార్స్ తో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలని కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్న రోజులివి. అలాంటి కంటెంట్ ఉన్న సినిమా అనే నమ్మకాన్ని ప్రచార చిత్రాలతో కలిగించింది బార్బరిక్. మరి ఈ సినిమా ఎలా ఉంది? నిజంగానే కొత్తగా ఉందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. (Tribanadhari Barbarik Movie Review)
కథ:
శ్యామ్(సత్యరాజ్) ఒక ప్రముఖ సైకాలజిస్ట్. కొడుకు, కోడలు యాక్సిడెంట్ లో మరణించడంతో.. మనవరాలు నిధి(మేఘన)ని అన్నీ తానై పెంచుతాడు. మనవరాలే తన ప్రపంచం అన్నట్టుగా బ్రతుకుతుంటాడు. పదో తరగతి చదువుకున్న నిధి ఒకరోజు కనిపించకుండా పోతుంది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు శ్యామ్. మరోవైపు రామ్ (వశిష్ట ఎన్ సింహా), దేవ్ (క్రాంతి కిరణ్) ఇద్దరు బాల్య స్నేహితులు ఉంటారు. రామ్ విదేశాలకు వెళ్ళాలని కలలు కంటుంటాడు. దేవ్ జూదం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లతో అప్పుల పాలవుతాడు. రామ్ విదేశాలకు వెళ్లాలన్నా, దేవ్ అప్పులు తీరాలన్నా లక్షల్లో డబ్బులు కావాలి. ఆ డబ్బు కోసం రామ్, దేవ్ ఎలాంటి దారి ఎంచుకున్నారు? నిధి కనిపించకుండా పోవడానికి, వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? అసలు నిధికి ఏమైంది? మళ్ళీ తన తాత దగ్గరకు చేరిందా? రామ్, దేవ్ వాళ్ళు కోరుకున్నట్టుగా డబ్బు సంపాదించగలిగారా? రామ్ విదేశాలకు వెళ్లాడా? వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
ఈ మధ్య మైథాలజికల్ టచ్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. 'త్రిబాణధారి బార్బరిక్' ప్రచార చిత్రాలు చూస్తే ఇది కూడా మైథాలజికల్ టచ్ ఉన్న సినిమా అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే అదే అంచనాలతో థియేటర్ కి వెళ్తే మాత్రం నిరాశ చెందక తప్పదు. నిజానికి ఇదొక రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్. బార్బరిక్ కి ఈ కథకి ఎటువంటి సంబంధం ఉండదు.
పురాణాలపై అవగాహన ఉన్న వారు.. బార్బరీకుడు పేరు వినే ఉంటారు. ఇతను ఘటోత్కచుని కుమారుడు మరియు భీముడి మనవడు. అందుకే 'త్రిబాణధారి బార్బరిక్' అనే టైటిల్ వినగానే.. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా.. పురాణాలను, వర్తమానాన్ని ముడిపెడుతూ సాగే కథ ఇది అనిపిస్తుంది. అయితే ఈ కథకి నేరుగా బార్బరిక్ తో సంబంధం ఉండదు. కానీ, ఈ క్రైమ్ థ్రిల్లర్ కథను డ్రైవ్ చేయడం కోసం.. బార్బరిక్ పాత్రను ఉపయోగించుకున్నారు. దర్శకుడు చేసిన ఈ కొత్త ఆలోచనను ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే.
తన మనవరాలు నిధి కనిపించడం లేదంటూ శ్యామ్(సత్యరాజ్) పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే చంద్ర(సత్యం రాజేష్)కి ఈ కేసుని అప్పగించడం.. సత్యరాజ్-సత్యం రాజేష్ కలిసి విచారణ మొదలుపెట్టడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ క్రమంలో రామ్, దేవ్ పాత్రల పరిచయం చేసి.. నిధి మిస్సింగ్ కి, వాళ్ళకి సంబంధం ఏంటనే ఆసక్తిని కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే స్టోరీ సెటప్ బాగానే ఉన్నప్పటికీ.. ప్రభావవంతమైన సన్నివేశాలను రాసుకోవడంలో దర్శకుడు తబబడ్డాడు. ఫస్ట్ హాఫ్ లో చాలా సీన్స్ రెగ్యులర్ గా, ఇంతకుముందు చూసినట్టే అనిపిస్తాయి. దాంతో ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఇంటర్వెల్ బ్లాక్ ని మాత్రం బాగానే డిజైన్ చేశారు.
ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ మెరుగ్గా ఉంది. కథనంలో కొన్ని మెరుపులు కనిపిస్తాయి. ఇన్వెస్టిగేషన్ కి దారి చూపించడం, నిందితుడిని గుర్తించడం, అతన్ని శిక్షించడం అంటూ బార్బరిక్ మూడు బాణాలతో కథను డ్రైవ్ చేసిన విధానం బాగుంది. నిధి మిస్సింగ్ కి కారణం ఎవరనే సస్పెన్స్ ని బాగానే మెయింటైన్ చేశారు. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ సర్ ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ రాసుకున్న తీరు కూడా బాగుంది.
మొత్తానికి బార్బరిక్ మూడు బాణాల కాన్సెప్ట్, ఇంటర్వెల్ బ్లాక్, పతాక సన్నివేశాలు.. ఈ సినిమాని నిలబెట్టాయి. కథాంశం, ట్విస్ట్ లతో పాటు సన్నివేశాల రూపకల్పన మీద కూడా మరింత దృష్టి పెట్టాల్సింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సీన్స్ ని కొత్తగా రాసుకొని ఉంటే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:
సత్యరాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. కథను భుజాన వేసుకొని నడిపించే శ్యామ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. తన సెటిల్డ్ పర్ఫామెన్స్ తో మరోసారి మెస్మరైజ్ చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో కట్టిపడేశారు. గొప్పగా బతకాలి ఉన్నా, చేతిలో డబ్బుల్లేక.. తప్పనిసరి పరిస్థితుల్లో డబ్బు కోసం ఫ్రెండ్ తో కలిసి అడ్డదారుల్లో నడిచే రామ్ పాత్రలో వశిష్ట ఎన్ సింహా ఆకట్టుకున్నాడు. సినిమాకి కీలకమైన, నెగటివ్ ఛాయలున్న దేవ్ పాత్రలో కొత్త నటుడు క్రాంతి కిరణ్ మెప్పించాడు. దేవ్ అత్తయ్య వాకిలి పద్మగా ఉదయభాను గెటప్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకున్నాయి. ఆ పాత్రను డిజైన్ చేసిన తీరు, అందులో ఉదయభాను ఒదిగిన తీరు బాగున్నప్పటికీ.. కథకి ఆ పాత్ర పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. శ్యామ్ మనవరాలు నిధి పాత్రలో మేఘన బాగా రాణించింది. సాంచి రాయ్, రాజేంద్రన్, వీటీవీ గణేష్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
బార్బరిక్ గురించి దర్శకుడు మోహన్ శ్రీవత్స బాగానే రీసెర్చ్ చేశారని అర్థమవుతోంది. బార్బరిక్ పేర్లలో ఒకటైన ఖాటు శ్యామ్ ను ప్రధాన పాత్రధారి సత్యరాజ్ కి పెట్టడంలోనే అది కనిపిస్తోంది. కథాకథనాలతో పాటు సన్నివేశాల విషయంలోనూ ఆయన మరింత దృష్టి పెడితే.. మంచి సినిమాలు తీయగలడు. సాంకేతిక విభాగాల పనితీరు బాగానే ఉంది. కుశేందర్ రమేష్ రెడ్డి కెమెరా పనితనం ఆకట్టుకుంది. పాటలతో పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయిన ఇన్ఫ్యూషన్ బ్యాండ్.. నేపథ్య సంగీతం విషయంలో మాత్రం బాగానే ప్రభావం చూపించింది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్ గానే ఉంది. అయితే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కి కోత పెట్టి ఉండాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా...
ఒక క్రైమ్ థ్రిల్లర్ కథని బార్బరిక్ మూడు బాణాల కాన్సెప్ట్ తో చెప్పాలన్న ఆలోచన బాగుంది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా, పౌరాణిక నేపథ్యమనే విషయాన్ని మనసులో పెట్టుకోకుండా వెళ్తే.. సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్, పతాక సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. టీం చేసిన ప్రయత్నం కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు.
రేటింగ్: 2.75/5
Disclaimer: Views expressed in this review are personal opinions of the reviewer and organisation doesn't take any liability. Viewers discretion is advised before commenting or reacting to this review.
![]() |
![]() |