![]() |
![]() |

'వార్-2'తో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆగస్టు 14న విడుదలైన ఈ మూవీ డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సత్తా చాటింది. ఎన్టీఆర్ కెరీర్ లో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరిన మూడో సినిమా 'వార్-2' కావడం విశేషం.
'ఆర్ఆర్ఆర్'తో మొదటిసారి ఈ ఫీట్ సాధించాడు ఎన్టీఆర్. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.1300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' కూడా దాదాపు రూ.500 కోట్లు సాధించింది. ఇక ఇప్పుడు 'వార్-2' ఐదు రోజుల్లోనే 300 కోట్ల క్లబ్ లో చేరి.. 400 కోట్ల దిశగా పయనిస్తోంది.
ఇప్పటిదాకా హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ కలిగి ఉన్న ఏకైక టాలీవుడ్ స్టార్ గా ప్రభాస్ ఉన్నాడు. ప్రభాస్ ఏకంగా రెండు సార్లు ఈ ఫీట్ సాధించాడు. మొదటిసారి 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'సాహో' సినిమాలతో వరుసగా 300 కోట్ల క్లబ్ లో చేరాడు. ఆ తర్వాత 'ఆదిపురుష్', 'సలార్', 'కల్కి' చిత్రాలతో మరోసారి హ్యాట్రిక్ 300 కోట్లు సాధించాడు. ప్రభాస్ తర్వాత హ్యాట్రిక్ 300 కోట్ల గ్రాసర్స్ ఉన్న టాలీవుడ్ హీరోగా ఇప్పుడు ఎన్టీఆర్ నిలిచాడు.
![]() |
![]() |