![]() |
![]() |

గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం వాయిదా పడింది. మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమాని జూలై 4కి వాయిదా వేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. (Kingdom)
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'కింగ్‌డమ్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. నిజానికి మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా.. మే 30కి వాయిదా పడింది. ఇప్పుడు మళ్ళీ జూలై 4కి పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం మన దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
అయితే ఇప్పటికే జూలై 4 తేదీపై నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'తమ్ముడు' సినిమా కర్చీఫ్ వేసింది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు, నితిన్ తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ.. దిల్ రాజు, నితిన్ లకు కృతఙ్ఞతలు తెలియజేసింది 'కింగ్‌డమ్' టీం.
'కింగ్‌డమ్'లో విజయ్ దేవరకొండ కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. జోమోన్ టి. జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్స్ గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

![]() |
![]() |