![]() |
![]() |
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన మారణ కాండ భారతదేశాన్నే కాదు, ప్రపంచ దేశాలను కూడా షాక్‌కి గురి చేసింది. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాత్రికులు పహల్గామ్‌కి విహార యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది. ఈ ఘటనపై అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ దాడిలో వైజాగ్‌కి చెందిన చంద్రమౌళి, నెల్లూరు వాసి మధుసూదనరావు ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఘటనలో అసువులు బాసిన వారికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడయా ద్వారా నివాళులు అర్పించారు. అయితే వారి కుటుంబాలను స్వయంగా ఎవరూ కలవలేదు. కానీ, హీరోయిన్ అనన్య నాగళ్ళ మాత్రం నెల్లూరు సమీపంలోని కావలికి చెందిన మధుసూదనరావు నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టారు. ‘పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈరోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. మధుసూదనరావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ అనన్య నాగళ్ల ట్వీట్ చేసారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి సరిపుచ్చుకోకుండా స్వయంగా మధుసూదనరావు నివాసానికి వెళ్లి నివాళి అర్పించడం, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చడం మెచ్చుకోవాల్సిన విషయమని నెటిజన్లు అనన్యను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయా కుటుంబాల్లో మానసిక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని కామెంట్ చేస్తున్నారు.
![]() |
![]() |