![]() |
![]() |

"కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు కానీ.. రావడం మాత్రం పక్కా". ఇది 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం 'హరి హర వీరమల్లు'కి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన వీరమల్లు.. రావడం లేట్ కావచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా అన్నట్టుగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రావడం మాత్రమే కాదు, వచ్చి రికార్డులు కొట్టడం కూడా పక్కా అని హింట్ కూడా ఇస్తోంది.
'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ మరో నాలుగైదు రోజులు డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని సమాచారం. త్వరలో వీరమల్లు బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తానని పవన్ ఇప్పటికే మేకర్స్ కి మాట ఇచ్చారట. దీంతో మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే థియేట్రికల్ బిజినెస్ చర్చలు మొదలయ్యాయట. ఒక్క ఆంధ్రా ఏరియాకే దాదాపు రూ.100 కోట్లు చెబుతున్నారని వినికిడి. ఇప్పటిదాకా ఎన్నో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు విడుదలైనా.. ఆంధ్రాలో వంద కోట్ల బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది వీరమల్లు టీం ఏకంగా వంద కోట్లు చెబుతుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
'హరి హర వీరమల్లు' సినిమాకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పవన్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. అలాగే మొదటిసారి చారిత్రాత్మక యోధుడు పాత్రలో కనువిందు చేయనున్నారు. ముఖ్యంగా పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ లెక్కన అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఫైనల్ రిలీజ్ డేట్ ని లాక్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేస్తే.. అంచనాలు మరో స్థాయికి వెళ్లే అవకాశముంది. అందుకే నిర్మాతలు బిజినెస్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదని తెలుస్తోంది. ఒక్క ఆంధ్రాకే రూ.100 కోట్లు చెబుతున్నారంటే.. నైజాం, సీడెడ్ కూడా తోడైతే.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.200 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక వరల్డ్ వైడ్ బిజినెస్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
![]() |
![]() |