![]() |
![]() |
కింగ్ నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. 2022 నవంబర్ 28న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అప్పటికి టైటిల్ ఫిక్స్ చేయలేదు. డి51 అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ కొనసాగించారు. 2024 మార్చి 8న ‘కుబేర’ అనే టైటిల్‌ని అఫీషియల్‌గా ఎనౌన్స్ చేశారు. ఇది జరిగినప్పటి నుంచి టైటిల్ విషయంలో ఓ వివాదం చోటు చేసుకుంది.
‘కుబేర’ అనే టైటిల్ తన పేరుపై రిజిష్టర్ చేసి ఉంది అంటూ కరిమికొండ నరేంద్ర అనే వ్యక్తి ఫిలిం ఛాంబర్‌కి ఫిర్యాదు చేశారు. ఆ టైటిల్‌తో తాము సినిమా కూడా నిర్మించామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023లోనే ‘కుబేర’ అనే టైటిల్‌ను రిజిష్టర్ చేసినట్టు తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం చెయ్యాల్సింది ఫిలిం ఛాంబర్‌కి విజ్ఞప్తి చేశారు నిర్మాత కరిమికొండ నరేంద్ర. అయితే ఫిలిం ఛాంబర్ ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో ఫిబ్రవరి 22న హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు నిర్మాత నరేంద్ర. ఈ సమావేశంలో నిర్మాత నరేంద్ర, కో ప్రొడ్యూసర్స్, నిర్మాతల లీగల్ ఎడ్వయిజర్ రాజేష్ పాల్గొన్నారు.
నిర్మాతల తరఫున అడ్వకేట్ రాజేష్ మాట్లాడుతూ ‘కుబేర అనే టైటిల్‌ని ఎన్నో రకాలుగా ఆలోచించి నరేంద్రగారు ఫిక్స్ చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. 90 శాతం షూటింగ్ పూర్తయింది. కుబేర అనే టైటిల్‌ని 2023 నవంబర్‌లోనే రిజిష్ట చేశారు. ఈ టైటిల్ నచ్చడంతో శేఖర్ కమ్ములగారు తమ సినిమాకి పెట్టుకున్నారు. అప్పుడే మేము కంప్లయింట్ చేశాము. అప్పుడు శేఖర్ కమ్ములాస్ కుబేర అని మార్చారు. శేఖర్ కమ్ముల అని చిన్న ఫాంట్ పెట్టి కుబేర అని పెద్ద ఫాంట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్. శేఖర్ కమ్ముల అంటే బ్రాండ్ కదా.. మీరు అంత తోపుడు మొనగాళ్ళయితే శేఖర్ కమ్ముల కుబేర అని ఒకే ఫాంట్‌తో, ఒకే సైజ్‌తో ప్రింట్ చేయండి. ఈ విషయంలో మా నిర్మాతలకు న్యాయం జరగాలి. వాళ్ళు నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నారు. వారికి నష్టపరిహారం చెల్లించాలి, టైటిల్‌లో షేర్ ఇవ్వాలి లేదా కుబేర అనే టైటిల్ తీసేసి వేరే టైటిల్ పెట్టుకోవాలి. చివరి ఆప్షన్ శేఖర్ కమ్ముల పేరు సినిమా టైటిల్ రెండూ సమానంగా ఉండేలా ప్రింట్ చేయాలి. వీటిలో ఏది ఎంపిక చేసుకుంటారో నిర్మాతల ఇష్టం’ అని తమ డిమాండ్లను వివరించారు.
![]() |
![]() |