![]() |
![]() |
‘పుష్ప’ చిత్రంలోని జాలిరెడ్డి క్యారెక్టర్‌కి ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో అందరికీ తెలుసు. ఆ క్యారెక్టర్‌ని అత్యద్భుతంగా పోషించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నటుడు డాలీ ధనంజయ. ఫిబ్రవరి 16 ఆదివారం డాలీ ఓ ఇంటివాడయ్యాడు. డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు నడిచాడు. డెంటిస్ట్‌గా పనిచేస్తున్న ధన్యతతో గత ఏడాది నవంబర్‌లో డాలి నిశ్చితార్థం జరిగింది. డాలీ, ధన్యత మొదట కలుసుకున్న ప్రదేశం మైసూర్. అందుకే తమ వివాహం కూడా అక్కడే చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకే అక్కడ టెంపుల్ థీమ్‌తో వివాహ వేదికను ముస్తాబు చేశారు. ఇరు కుటుంబ సభ్యులతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో డాలీ, ధన్యతల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహానికి హాజరు కానివారు సోషల్ మీడియా ద్వారా నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, పాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు డాలీ ధనంజయ. 2018లో వచ్చిన ‘భైరవగీత’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించారు రామ్‌గోపాల్‌వర్మ. ఈ సినిమా తర్వాత పుష్ప సిరీస్‌లో నటించాడు ధనంజయ. 2013లో ‘డైరెక్టర్స్ స్పెషల్’ అనే కన్నడ సినిమాతో హీరోగా పరిచయమైన ధనంజయ ఇప్పటి వరకు కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో పాతిక సినిమాల్లో నటించాడు. దాదాపు 15 పాటలు రాశాడు.
![]() |
![]() |