![]() |
![]() |

గత కొంతకాలంగా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య ఓ వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా రామ్‌చరణ్, అల్లు అర్జున్ మధ్య ఈ గ్యాప్ అనేది ఏర్పడింది. దాంతో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద రణరంగమే జరుగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని అన్ ఫాలో చేశారు రామ్‌చరణ్. ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. గతంలోనే ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్గే భగ్గుమంటుంది అనే రేంజ్‌లో మాటల యుద్ధాలు జరిగేవి. బన్నీ, చరణ్ మధ్య ఒక కోల్డ్ వార్ నడుస్తోంది అనే వాదన నిజమేనన్నట్టు ఈ ఇద్దరూ ఎప్పుడూ ఎడమొహం, పెడ మొహంగా ఉండడం అందరూ గమనిస్తున్నారు. అలాగే తమ తమ సినిమాలకు సంబంధించి ఎలాంటి విషెస్ చేసుకోకపోవడం, సినిమా హిట్ అయితే ఒకరినొకరు కంగ్రాట్యులేట్ చేసుకోకపోవడం చూస్తుంటే నిజంగానే వీరి మధ్య పెద్ద అగాధం ఏర్పడిందనేది నిజం అనిపిస్తుంది. దానికి తోడు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అనే పదాన్నే మర్చిపోయినట్టు బిహేవ్ చెయ్యడం కూడా మెగా ఫ్యాన్స్‌ని బాధించింది. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉందని, అది అల్లు ఆర్మీ అని అతను ప్రకటించుకోవడం చూస్తే మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్‌ని రామ్‌చరణ్ అన్ ఫాలో చేయడం ఈ వివాదం మరింత ముదరడానికి కారణమవుతోంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే..
చరణ్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో చెక్ చేస్తే నిజంగానే బన్నీని ఫాలో అవట్లేదు. మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్ అందరినీ ఫాలో అవుతున్నాడు చరణ్. అలాగే అల్లు ఫ్యామిలీ నుంచి శిరీష్‌ను ఫాలో అవుతున్నాడు. మెగా, అల్లు హీరోలలో కేవలం బన్నీని మాత్రమే చరణ్ ఫాలో అవ్వడం లేదు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
పుష్ప2 రిలీజ్ సందర్భంగా ఎంత దారుణమైన విషయం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో బన్ని ఎన్నో రకాల ఆందోళనలకు, విమర్శలకు గురయ్యాడు. చిరంజీవి, నాగబాబు ఈ విషయంలో బన్నీ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పారు. కానీ, చరణ్ మాత్రం ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టకపోవడం బన్నీ ఫ్యాన్స్‌ని బాధించింది. ఇక చరణ్ ఫ్యాన్స్ సైడ్ చూస్తే తమ హీరో నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ చిత్రంపై బన్నీ ఫ్యాన్స్ తీవ్రమైన నెగెటివ్ ప్రచారం చేసారని చరణ్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. అలాగే పైరసీ ప్రింట్లను లెక్కకు మించి రిలీజ్ చేసి వివిధ వెబ్‌సైట్లలో పెట్టారని అంటున్నారు. దానిపై స్పందించిన పోలీసులు ఇప్పటికే 45 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ పరిణామాన్ని సినీ ప్రేమికులు తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఇద్దరు హీరోల మధ్య అభిప్రాయ భేదాలుగానీ, మనస్పర్థలుగానీ, కుటుంబ సంబంధించిన విభేదాలుగానీ ఉంటే అవి వారు వ్యక్తిగతంగా పరిష్కరించుకోవాలి తప్ప వారు నటించే సినిమాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చేస్తున్న పని అదే. ఒకరి సినిమాను ఒకరు బ్యాడ్ చేసుకోవడం వల్ల ఇద్దరూ నష్టపోయే అవకాశం ఉంది. తద్వారా నిర్మాత నష్టాల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది.
ఇటీవల అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ సినిమా గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అనే విషయాన్ని ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో ప్రస్తావించడం చరణ్ ఫ్యాన్స్‌ని బాధించింది. దాని గురించి అరవింద్‌ని ట్రోల్ చేయడంతో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అల్లు ఫ్యాన్స్ వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అనేది ఇద్దరు హీరోల అభిమానుల్లో బలంగా నాటుకుంది. కానీ, ఓ పక్క చిరంజీవి సంయమనం పాటిస్తూ రెండు కుటుంబాలను కలిపేందుకు ఎంతో కొంత కృషి చేస్తున్నారని అర్థమవుతోంది. ఒక ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడుతూ పుష్ప2 సూపర్‌హిట్ సినిమా అంటూ కితాబునిచ్చారు. దీని ద్వారా తమ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రెండు కుటుంబాల గురించి ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న రచ్చను ఆపేందుకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజాగా అల్లు అర్జున్‌ని రామ్‌చరణ్ అన్ ఫాలో చెయ్యడం అనేది మరో పెద్ద రాద్ధాంతంగా మారింది. ఇలాంటి సమయంలోనే రామ్‌చరణ్, అల్లు అర్జున్.. తమ అభిమానులకు ఒక బలమైన సూచన చేయాల్సి ఉంది. తమ సినిమాలను బ్యాడ్ చేసే ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని అభిమానులకు చెప్పాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ ఇద్దరు హీరోల అభిమానులు శాంతించే అవకాశం ఉంది.
![]() |
![]() |