![]() |
![]() |
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘తండేల్’ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యదార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. నాగచైతన్య, సాయిపల్లవిల పెర్‌ఫార్మెన్స్, చందు మొండేటి టేకింగ్, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ హైలైట్ అని అందరూ ప్రశంసిస్తున్నారు. తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ‘తండేల్’ చిత్రాన్ని వీక్షించారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా సినిమాపై తన విశ్లేషణను తెలియజేశారు.
‘చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథను చూశాను. నాగచైతన్య, సాయిపల్లవి పోటీపడి నటించారు. చందు మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్‌పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్‌కు అభినందనలు. ఒక్క మాటలో ఇది ఒక దర్శకుడి సినిమా’ అని ట్వీట్ చేశారు రాఘవేంద్రరావు. తమ సినిమాపై దర్శకేంద్రుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై నాగచైతన్య కూడా స్పందించారు. ‘థాంక్యూ సో మచ్ సర్.. మీ మాటలు మాకు ఎంతో విలువైనవి. మీకు మా సినిమా నచ్చినందుకు సంతోషం’ అంటూ సమాధానమిచ్చారు నాగచైతన్య. సాధారణంగా సినిమాలపై రాఘవేంద్రరావు తన స్పందన తెలియజేయడం చాలా అరుదు. అలాంటిది చాలా కాలం తర్వాత ఆయన నుంచి వచ్చిన ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
![]() |
![]() |