![]() |
![]() |

తెలుగు నాట స్టార్ హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ స్టార్ హీరో ఈవెంట్ జరిగినా.. అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో హాజరై, అందరూ ఆ ఈవెంట్ గురించి మాట్లాడుకునేలా చేస్తుంటారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ల విషయంలో నందమూరి అభిమానులకు మాత్రం వరుసగా నిరాశే ఎదురవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా నటించిన 'దేవర' (Devara) చిత్రం గతేడాది సెప్టెంబర్ లో విడుదలై, భారీ వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సినిమా విడుదలకు ముందు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేయగా, అది చివరి నిమిషంలో రద్దయింది. వేదిక కెపాసిటీకి మించి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో.. భద్రతా కారణాల దృష్ట్యా ఈవెంట్ ని క్యాన్సిల్ చేశారు. దీంతో అప్పుడు నందమూరి ఫ్యాన్స్ ఎంతో డిజప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి వారికి అలాంటి నిరాశే ఎదురైంది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన 'డాకు మహారాజ్' (Daaku Maharaaj) చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే అనంతపురంలో జనవరి 9 సాయంత్రం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుకకు బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. దీంతో నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురుచూశారు. కానీ తిరుమలలో తొక్కిసలాట జరిగి కొందరు భక్తులు మరణించడంతో.. ఈ సమయంలో సినిమా వేడుక జరపడం కరెక్ట్ కాదని భావించి, వేడుకను రద్దు చేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది.
వరుసగా రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు క్యాన్సిల్ కావడంతో.. నందమూరి ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. 'డాకు మహారాజ్' విడుదలకు ముందు, బాలకృష్ణ ఒక ప్రెస్ మీట్ అయినా నిర్వహిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
![]() |
![]() |