![]() |
![]() |
ఇటీవలికాలంలో చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ నెల 4న నాగచైతన్య, శోభిత పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈరోజు అంటే డిసెంబర్ 7న మరో రెండు జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాయి. వీరిలో ఒకరు హీరో సాయికిరణ్ కాగా, మరొకరు దర్శకుడు సందీప్‌రాజ్.
సాయికిరణ్ ‘నువ్వేకావాలి’ చిత్రంతో హీరోగా పరిచయమై ఆ తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగానూ, కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి ప్రస్తుతం టీవీ సీరియల్స్‌తో బిజీ అయిపోయారు. తనతోపాటు ఓ సీరియల్‌లో నటిస్తున్న స్రవంతిని ఈరోజు వివాహం చేసుకోబోతున్నారు. గత నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది. గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. 46 ఏళ్ళ సాయికిరణ్‌కి ఇదివరకే వైష్ణవితో పెళ్లి జరిగింది. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడం వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. వారికి ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు స్రవంతిని వివాహం చేసుకొని మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు.
‘కలర్ ఫోటో’ చిత్రంతో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సందీప్‌రాజ్ పెళ్లి కూడా ఈరోజు జరిగింది. కొన్ని సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించిన చాందినీరావును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సందీప్. వీరి నిశ్చితార్థం గత నెలలో జరిగింది. తిరుపతిలో ఘనంగా జరిగిన వీరి పెళ్లికి హీరో సుహాస్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఇంకా దివ్యశ్రీపాద, ప్రియ వడ్లమాని, సుమ కుమారుడు రోషన్, వైవా హర్ష ఈ వివాహానికి హాజరయ్యారు.
![]() |
![]() |