![]() |
![]() |
గత కొంతకాలంగా మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చిన ఏ అవకాశాన్నీ వదలకుండా ఇరువర్గాల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎవరి స్టైల్‌లో వాళ్ళు రెచ్చిపోతున్నారు. తాజాగా అలాంటి ఓ అవకాశం బన్నీ ఫ్యాన్స్‌కి వచ్చింది. ఈ కొత్త రగడకు ఆజ్యం పోసింది ఎవరో కాదు తమిళ్ హీరో ప్రశాంత్. శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన జీన్స్ చిత్రంలో అతను నటించిన విషయం తెలిసిందే. ఆమధ్య రామ్‌చరణ్ సినిమా వినయ విధేయ రామ చిత్రంలో కూడా ప్రశాంత్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందిన ‘గోట్’ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్‌కి బాగా గుచ్చుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌ని టార్గెట్ చేస్తూ వార్ మొదలుపెట్టారు.
సినిమా టైటిల్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఆ కాన్సెప్ట్‌లోనే ఈవెంట్‌కి హాజరైన అతిథుల్ని, యూనిట్ మెంబర్స్‌ని తెలుగు ఇండస్ట్రీలో గోట్ ఎవరు అంటూ ప్రశ్నించింది యాంకర్. ఆ క్రమంలోనే ప్రశాంత్‌ని కూడా అడిగింది. దానికి ప్రశాంత్ తెలుగు ఇండస్ట్రీలో గోట్ అంటే చిరంజీవి అని నా అభిప్రాయం అన్నాడు. రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం చక్రం తిప్పుతున్న పవన్‌కళ్యాణ్ రియల్ గోట్. ఎందుకంటే ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి విజయం సాధించారు. అందుకే ఆయన రియల్ గోట్. ఇక డాన్స్ అంటే నా ఉద్దేశంలో జూనియర్ ఎన్టీఆర్, స్టైల్ అంటే అల్లు అర్జున్ అన్నాడు. ఈ మాట చెర్రీ ఫ్యాన్స్‌కి కోపం తెప్పించింది. ఎందుకంటే రామ్‌చరణ్‌తో వినయవిధేయ రామ సినిమా చేశాడు. ఆ సినిమా చేసిన తర్వాత కూడా చరణ్ గురించి చెప్పకపోవడంతో మెగా ఫ్యాన్స్‌కి కాలింది. దీన్ని అదనుగా తీసుకున్న బన్నీ ఫ్యాన్స్ చరణ్‌తో ఒక సినిమా చేసినా అతని డాన్స్ గురించి చెప్పలేకపోయాడు అంటూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి అన్నట్టు స్టేజ్ మీద ఉన్నంత సేపు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ప్రశాంత్. మహేష్, ప్రభాస్, బాలయ్య అంటూ ఆడియన్స్ గోల చేస్తుండడంతో.. ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అతను గోట్ అనీ, మహేష్ ఛార్మింగ్ అంటూ చివరలో జై బాలయ్య అని ముగించాడు. ఆడియన్స్‌లో వచ్చిన కదలిక చూసిన ప్రశాంత్ ఇక ఎక్కువ సేపు స్టేజ్ మీద ఉంటే ప్రమాదం అని గ్రహించి అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే ప్రశాంత్ పెట్టిన చిచ్చు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ డాన్స్ ఇరగదీస్తారని అందరికీ తెలుసు. అలాంటిది చరణ్ పేరు ప్రస్తావించకుండా ప్రశాంత్ మాట్లాడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
![]() |
![]() |